ప్రతి గ్రామానికి త్రీఫేజ్ విద్యుత్ లైన్లు ఏర్పాటు
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
తేతలిలో రెండు 100 కేవీ ట్రాన్స్ఫార్మర్లు ప్రారంభం
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్ సమస్యలు పరిష్కరించే దిశగా ప్రణాళికలు చేసినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. తణుకు మండలం తేతలి ఎస్సీ కాలనీలో సింగిల్ ఫేజ్ నుంచి త్రీ ఫేజ్‌కు మార్చడంతోపాటు రెండు 100 కేవీ ట్రాన్స్ఫార్మర్లు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నాయకుల నిర్లక్ష్యం కారణంగా తలెత్తిన విద్యుత్ సమస్యలను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీగా విద్యుత్ లైన్లు త్రీఫేజ్‌కు మార్చి నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి విద్యుత్ శాఖను బ్రష్టు పట్టించారని ఆరోపించారు. నాణ్యమైన విద్యుత్ ప్రజలకు అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా నిధులు కేటాయించి మెరుగైన విద్యుత్ సేవలు అందించనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో లోవోల్టేజీ, ట్రిప్పింగ్ సమస్యలను దశలవారీగా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.