అభినవ రాబిన్ హుడ్ వంగవీటి మోహన రంగా

అందరివాడిగా పేరొందిన స్వర్గీయ వంగవీటి మోహన రంగా మాదిరిగా వంగవీటి రాధ కూడా రాష్ట్రస్థాయి ప్రజా నాయకుడిగా ఎదగాలని ఆశిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అమరుడై 35 గడిచినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వంగవీటి మోహన రంగా 78వ జయంతి వేడుకలు పురస్కరించుకొని సోమవారం నిడదవోలు నియోజకవర్గం కాకరపర్రు లో వంగవీటి రాధా తోపాటు మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రంగా సేవలను గుర్తు చేశారు. ప్రతి సామాన్యుడికి న్యాయం జరగాలన్నదే వంగవీటి మోహన రంగా లక్ష్యమన్నారు.వంగవీటి మోహనరంగా ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగా ఏనాడూ పేద ప్రజలను కులాల రూపంలో చూడలేదని అన్నారు. పేద ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తిగా కీర్తి గాంచారన్నారు. పేదలకు అండగా నిలబడి న్యాయం చేసిన నాయకుడు కాబట్టే నేటికీ గ్రామాల్లో పట్టణాల్లో ఆయన విగ్రహాలు దర్శనమిస్తున్నాయని అభివర్ణించారు. తన చివరి శ్వాస వరకు పేద ప్రజల కోసం బతికిన మహోన్నత నాయకుడు, పేద ప్రజల కంట కన్నీరు రాకుండా చూసిన నాయకుడు వంగవీటి మోహన రంగా అన్నారు.అదే తమకు రాజకీయాల్లో స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఆయన స్ఫూర్తితో కుల మతాలకతీతంగా అన్ని కులాల్లోని పేదలకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

పెద్దోడిని కొట్టి పేదోడికి పంచిన అభినవ రాబిన్ హుడ్ వంగవీటి మోహన రంగా అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పార్టీలకతీతంగా వ్యక్తిగత ఇమేజ్ తో గెలిచిన నాయకుడు అని వివరించారు. పేదవాడి కంట కన్నీరు తుడవటం మీద లక్ష్యంగా పార్టీని స్థాపించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు సైతం వంగవీటి మోహనరంగా ఆలోచనలకు దగ్గరగా ఉంటాయన్నారు. పేద ప్రజల కోసం పరితపించిన ఆయన విధానాలు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.

తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని, తండ్రికి తగ్గ తనయుడుగా పేరొందుతూ యువత కోరుకున్న విధంగా నాయకత్వాన్ని అందిస్తున్న యువనేత వంగవీటి రాధా అని అన్నారు. పదవి అక్కర్లేదు తండ్రిలా ప్రజాసేవ చేయడమే తనకు ముఖ్యమని రాధా వ్యవహరిస్తున్న తీరు ప్రతి ఒక్కరికి ఆదర్శం అన్నారు. మంత్రి కందుల దుర్గేష్ స్పీచ్ తో వంగవీటి అభిమానుల్లో ఉత్తేజం ఉరకలెత్తింది. ఒక సందర్భంలో రావడం మాత్రం లేట్ అవ్వచ్చు కానీ రావడం పక్కా అన్న మాటకు అభిమానం ఉప్పొంగింది.

Scroll to Top
Share via
Copy link