యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

తణుకులో జాబ్ మేళా ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ

దాదాపు 70 బహుళ జాతి సంస్థలు ఉద్యోగాల కల్పనకు అవకాశాలు

హాజరైన సుమారు 3500 మంది అభ్యర్థులు

తణుకు మహిళా కళాశాలలో ఏర్పాటుచేసిన మెగా జాబ్ మేళా

యువతకు ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు.భవిష్యత్తులో ఉద్యోగాల కల్పనకు తణుకులో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా ఒక వేదికగా నిలుస్తుందని చెప్పారు. ఆదివారం తణుకు కొండేపాటి సరోజినీ దేవి (ఎస్.కె.ఎస్.డి)మహిళా కళాశాల ఆవరణలో నిర్వహించిన మెగా జాబ్ మేళా ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నాయని ఇందుకు సంబంధించి ముందుగానే దాదాపు 3500 మంది రిజిస్ట్రేషన్లు చేసుకుని ఉద్యోగమేళాకు అభ్యర్థులు హాజరయ్యారని అన్నారు. దేశంలో దాదాపు 50 శాతం మంది యువత ఉన్నారని భవిష్యత్తులో యువతకు దేశాన్ని నడిపించగలిగే శక్తి ఉందన్నారు. ఇందులో భాగంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాయని చెప్పారు. ప్రపంచంలో ఏ మూల ఉద్యోగ అవకాశాలు ఉన్నా వదులుకోకుండా వాటిని అందిపుచ్చుకోవడం ద్వారా భవిష్యత్తు సుగమం అవుతుందని అన్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేశ ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకురావడానికి కృషి చేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే దాదాపు రూ. 9:30 లక్షల కోట్లు పెట్టుబడితో పరిశ్రమలు ఏర్పాటు చేసి సుమారు 4.50 లక్షల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని చెప్పారు. కేవలం రాజకీయ అవసరాల కోసమో లేదా ప్రచారం కోసమో ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయలేదని తణుకు నియోజకవర్గంలోని యువత భవిష్యత్తు కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు తణుకులో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు వచ్చిన అనూహ్య స్పందన చూస్తే యువత ఎంతమేర ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారో అర్థమవుతుందని అన్నారు. ఉద్యోగాలు రావడం ముఖ్యం కాదని ఇలాంటి జాబ్ మేళాలో పాల్గొని ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవడం ప్రధానమని ఇది భవిష్యత్తులో ఎంత ఉపయోగపడుతుందని చెప్పారు. తాను సింగపూర్ లో ఉద్యోగ అవకాశాల కోసం వెళ్ళిన సమయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డానని గుర్తు చేసుకున్నారు. ఉద్యోగంలో చేరిన మొదటి రోజుల్లో ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి ముందుకు వెళ్లాలని సూచించారు. బహుళ జాతి సంస్థలే కాకుండా స్థానికంగా ఉండే సంస్థలు సైతం ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తున్నాయని చెప్పారు. ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలు రాకపోయినప్పటికీ అభ్యర్థులు ప్రభుత్వ రంగ సంస్థ అయిన సీడ్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆరు నెలల శిక్షణ ఇచ్చి భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంటుందని అన్నారు. మీ సమస్య మా పరిష్కారం పేరుతో ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా యువతకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ మెగా జాబ్ మేళాలో అవకాశాలు పొందిన అభ్యర్థులతో పాటు స్థానికంగా ఏర్పాటు చేసిన ఏర్పాట్లు పట్ల అభ్యర్థులు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link