అవుట్ సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికుల వేతనాల పెంపు
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
ఎమ్మెల్యే రాధాకృష్ణకు కృతజ్ఞతలు తెలిపిన కార్మికులు
అవుట్సోర్సింగ్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఇటీవల తమ సమ్మెకు స్పందించి జీతాలు పెంచినందుకు తణుకు మున్సిపాలిటీ ఇంజినీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులు మంగళవారం ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు రూ. 10 వేల నుంచి రూ. 13 వేలకు పెంచడం జరిగిందన్నారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అందుకు అనుగుణంగా వారి వేతనాలను రూ. 3 వేలు పెంచినట్లు చెప్పారు. తణుకు పట్టణంలో సుమారు 57 మంది ఇంజనీరింగ్ కార్మికుల వేతనాలు పెంపుదల జరిగిందన్నారు. ఉద్యోగుల పట్ల కూటమిప్రభుత్వం అండగా ఉంటుందని అంతేకాకుండా వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్టర్ ఔట్ సోర్సింగ్ యూనియన్ కార్మికులు పాల్గొన్నారు.