చేనేతను ప్రోత్సహిస్తున్న కూటమి ప్రభుత్వం

చేనేత కార్మికులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు

అంతర్జాతీయంగా చేనేతకు గుర్తింపు తీసుకురావడానికి కృషి

జాతీయ చేనేత దినోత్సవంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ

చేనేత వస్త్రాలను ప్రోత్సహిస్తున్న కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు సైతం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రతి ప్రపంచవ్యాప్తంగా చేనేత వస్త్రాలకు గుర్తింపు తీసుకువచ్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నట్లు చెప్పారు. గత కొన్నేళ్లుగా చేనేత పై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల సంఖ్య తగ్గుతూ వస్తోందని అన్నారు. ముఖ్యంగా ముడి సరుకు కొరతతో పాటు వాటి పెరుగుదల కూడా ఒక కారణమని చెప్పారు. మరోవైపు గిట్టుబాటు ధర లేకపోవడంతో అనేకమంది కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి చేనేత వస్త్రాల వినియోగాన్ని పెంపొందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కేవలం రాష్ట్రంలోనే కాకుండా జాతీయంగా అంతర్జాతీయంగా చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తూ ఒక గుర్తింపు తీసుకురావడానికి ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా చేనేత వస్త్రాలను సంబంధించి మగ్గాలు నిర్వహిస్తున్న వారికి 200 యూనిట్లు, మర మగ్గాలు ఉన్నవారికి 500 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్తు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు చెప్పారు. చేనేత వస్త్రాలపై ఐదు శాతం ఉన్న జీఎస్టీ సైతం ప్రభుత్వం భరించేలా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. అనంతరం పదిమంది చేనేత కార్మికులను ఎమ్మెల్యే రాధాకృష్ణ సత్కరించారు. ఈ కార్యక్రమంలో తణుకు ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ, చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి, తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link