రైతులకు పెట్టుబడి సాయం కింద ఇస్తానన్న ఇరవై వేల రూపాయలను తక్షణమే అందించి రైతులను ఆదుకోవాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి రుణపరపతి కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. రైతాంగం సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం భీమవరం కలెక్టరేట్ వద్ద సీపీఐ, రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేసి జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లుకువినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కోనాల మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు రైతులకు పెట్టుబడి సాయం ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారని, అధికారం చేపట్టి ఐదు నెలలు దాటిందని ఇప్పటికీ సాగు సాయం ఇవ్వక పోవడం దారుణమని విమర్శించారు. జిల్లాలో అతివృష్టి వల్ల వేలాది ఎకరాలు సాగుకు నోచుకోలేదని రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని వారిని ఆదుకోవాలని కోనాల డిమాండ్ చేశారు. జిల్లాలో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు ప్రారంభించాలని, గోనె సంచులు, పురికొసలు రైతులకు అందించాలని, డ్రైనేజీ, ఇరిగేషన్ వ్యవస్ధలను ప్రక్షాళన చేయాలని మెట్ట ప్రాంతాల్లో చెరువులు బాగుచేసి సాగునీరు అందించాలని కోనాల డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ విధానాల వల్ల మన రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబంపై సుమారు 2 లక్షల 45 వేల రూపాయల రుణం ఉందని దాన్ని మాఫీ చేయాలని కోనాల డిమాండ్ చేశారు. రబీ సీజన్లో రైతాంగం సాగు చేస్తున్న పంటలన్నింటికి పంటల భీమా సొమ్ము ప్రభుత్వమే భరించి రైతాంగాన్ని అందుకోవాలని కోనాల డిమాండ్ చేశారు.
రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వైవీ ఆనంద్ మాట్లాడుతూ కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి రుణ పరపతి కల్పించాలని, గతంలో నష్టపోయిన పంటలకు కూడా వారికి నష్ట పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కలిశెట్టి వెంకట్రావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు, ఎం.సీతారాంప్రసాద్, సికిలే పుష్పకుమారి, రైతు సంఘం నాయకులు కర్రి సూరిబాబు, జి.గణపతి,తమరాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు