గ్రంధాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా, బుధవారం స్థానిక శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి గుత్తికొండ కృష్ణారావు ఆధ్వర్యంలో ముగింపు సభ జరిగింది. సభకు డ్రాయింగ్ టీచర్ బొడ్డేటి శ్రీనివాస రావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సభకు స్థానిక మల్లిన వెంకట నరసమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.ఎస్.కె. మాణిక్యాలరావు అధ్యక్షత వహించారు. తొలుత గ్రంధాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆకెళ్ళ శ్రీనివాసరావు సభికులకు ఆహ్వానం పలికారు. విద్యార్థులు ఖాళీ సమయంలో గ్రంధాలయం సందర్శించి ఆసక్తి గల పుస్తకాలు చదువుకుని జ్ఞానవంతులు కావాలని విద్యార్థులకు పిలుపు నిచ్చారు. ప్రధానోపాధ్యాయులు కె.ఎస్.కె.మాణిక్యాలరావు మాట్లాడుతూ, సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి గురించి వివరించారు. విద్యార్థులు ఆ శక్తిని గురించి గుర్తించాలని పిలుపు నిచ్చారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డా.జె.చంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, విద్యార్థులు లోకజ్ఞానాన్ని పెంపొందించుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సమగ్రంగా వివరించారు. రిటైర్డు ఆంగ్ల భాష అధ్యాపకులు, కోట రామ ప్రసాద్ మాట్లాడుతూ, విద్యాలయం, దేవాలయం, గ్రంధాలయం ప్రాముఖ్యత వివరించారు. ఈ సందర్భంగా రిటైర్డు ప్రిన్సిపాల్ డా. జె.చంద్ర ప్రసాద్ ను, రిటైర్డు లెక్చరర్ కోట రామ ప్రసాద్ లను గ్రంధాలయం తరఫున తహసిల్దార్ పి.ఎన్.డి. ప్రసాద్, యం.పి.డి.ఓ. వి.వి.వి.రామారావు, గ్రంథాలయాధికారి గుత్తికొండ కృష్ణారావు, గ్రంధాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆకెళ్ళ శ్రీనివాసరావు ప్రభృతులు దుశ్శాలువాలు, పుష్ప గుచ్ఛాలతో సత్కరించారు. ఈ సందర్భంగా గత వారం రోజులుగా జరిగిన వ్యాస రచన, వక్తృత్వం డ్రాయింగ్, మ్యూజికల్ చైర్స్, చదరంగం, ముగ్గుల పోటీల లో విజేతలకు పెద్దల చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీమతి గుత్తికొండ స్రవంతి, మహతి స్కూల్ ప్రిన్సిపాల్ ఐ.పుష్పవతి, గాయత్రి, వివేకానంద, ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు