భారతదేశ చరిత్ర, సంస్కృతి, కళలు ప్రతిబింబించేలా “కృష్ణవేణి సంగీత నీరాజనం” కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్యాటక, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 6,7,8 తేదీల్లో విజయవాడ తుమ్మల పల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కార్యక్రమం నిర్వహణ కార్యక్రమానికి హాజరు కానున్న కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పిలుపు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కేంద్ర ప్రభుత్వ పథకం సాస్కి ద్వారా అఖండ గోదావరి, గండికోట అభివృద్ధికి రూ. 177 కోట్ల నిధులు మంజూరు. జనవరి నుండి పనులు ప్రారంభం అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా హేవలాక్ వంతెన పునర్నిర్మాణం, అధ్యాత్మిక కేంద్రంగా పుష్కర్ ఘాట్ అభివృద్ధి, నిడదవోలు కోట సత్తెమ్మ ఆలయానికి సరికొత్త శోభ, హేవలాక్ వంతెన ప్రాంతంలో గ్లాస్ వంతెనలు,వాటర్ స్పోర్ట్స్ పర్యాటకులు విశ్రాంతి తీసుకునేలా సీటింగ్ ప్రాంతాలు, రెస్ట్ రూమ్స్అ డ్వెంచర్ టూరిజం స్పాట్ గా గండికోటను తీర్చిదిద్దుతామన్న మంత్రి దుర్గేష్ గోదావరి పుష్కరాల నాటికి అద్భుత పర్యాటక కేంద్రంగా రాజమహేంద్రవరంను తీర్చిదిద్దుతామని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్
విజయవాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్యాటక, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో భారతదేశ సాంస్కృతిని, చరిత్రను, ప్రాచుర్యంలో లేని ప్రాంతాలను, స్థానికంగా ప్రఖ్యాతి పొందిన సంగీతం, నృత్య ప్రతిభను ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో డిసెంబర్ 6,7,8 తేదీల్లో విజయవాడలో కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం చేపట్టబోతున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. బుధవారం విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం వివరాలు వెల్లడించారు. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరవుతారని తెలిపారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కళాకారులు కార్యక్రమానికి వస్తారని ఈ నేపథ్యంలో కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. గడిచిన ఐదేళ్లలో కుంటుపడిన రాష్ట్ర సంస్కృతి, కళలు, ఇతర కార్యక్రమాలను పునప్రారంభిద్దామన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కళలకు కాణాచి అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళా, సాంస్కృతిక వైభవాన్ని పునరుజ్జీవింపజేసేందుకు నిర్వహిస్తున్న అద్భుతమైన కార్యక్రమంగా కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమాన్ని అభివర్ణించారు. ప్రారంభోత్సవ కార్యక్రమం ఇప్పటికే రాష్ట్రంలోని రాజమండ్రి, కర్నూలు, మంగళగిరి, శ్రీకాకుళం లాంటి ప్రాంతాల్లో నిర్వహించడం జరిగిందని తెలిపారు. భారతదేశంలో అనాదిగా పరిఢవిల్లుతున్న కళలు, సంస్కృతిని ప్రజలందరికీ తెలియజేసి పునరుత్తేజం పొందాలన్న ఉద్దేశంతో రాష్ట్ర సహకారంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పర్యాటక శాఖకు సంబంధించి ప్రాచుర్యంలో లేని ప్రాంతాలను ప్రపంచానికి తెలియపరుస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల చొరవతో, పర్యాటక శాఖ కృషితో కేంద్ర ప్రభుత్వం సాస్కి(స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్) పథకం ద్వారా పర్యాటక రంగానికి దాదాపు రూ.177 కోట్లు కేటాయించిందన్నారు. ఆ నిధులతో అఖండ గోదావరి, గండికోట ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నామన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక (డీపీఆర్) పంపించగా సానుకూలత వ్యక్తమైందన్నారు. జనవరి నుండి పనులు ప్రారంభిస్తామన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా రూ. 99 కోట్లతో శతాబ్ధం చరిత్ర కలిగి నిరుపయోగంగా ఉన్న హేవలాక్ బ్రిడ్జిని అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. గ్లాస్ బ్రిడ్జి, బోట్ రైడింగ్, వాటర్ స్పోర్ట్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు. బ్రిడ్జి లంకను అభివృద్ధి చేస్తామన్నారు. గోదావరి పుష్కరాల నాటికి అద్భుత పర్యాటక కేంద్రంగా రాజమహేంద్రవరంను తీర్చిదిద్దుతామన్నారు. అదే విధంగా కడియం నర్సరీని అద్భుతంగా తీర్చిదిద్ది పర్యాటక కళ తెస్తామన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర, గొప్ప వారసత్వ సంపదకు ప్రతీక అయిన గండికోటలో అడ్వెంచర్ టూరిజం అభివృద్ధికి శ్రీకారం చుడతామన్నారు. గండికోట అభివృద్ధిలో భాగంగా రిసార్ట్స్, కెప్టేరియాను నిర్మిస్తామన్నారు. గ్రాండ్ కాన్యన్ తరహాలో గండికోటలో అంతర్జాతీయ పర్యాటక మౌలిక వసతులు కల్పించి ఇంటర్నేషనల్ ఐకానిక్ టూరిస్ట్ డెస్టినేషన్ సెంటర్ గా మార్చేందుకు చర్యలు చేపడతామన్నారు. కేరళకన్నా అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఆంధ్రప్రదేశ్ సొంతమని మంత్రి దుర్గేష్ తెలిపారు. పర్యాటకులు ఏదైనా పర్యాటక ప్రాంతానికి వస్తే మూడు నాలుగు రోజులు గడిపేలా మౌలిక వసతులు కల్పించి, టూరిజం సర్క్యూట్ లను అభివృద్ధి చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో ఈ తరహా మరిన్ని కార్యక్రమాలను విస్తృతపరుస్తామన్నారు. టెంపుల్ టూరిజంతో పాటు ఎకో, వెల్ నెస్, హెరిటేజ్, అడ్వెంచర్ టూరిజంలను అభివృద్ధి చేస్తామన్నారు. గడిచిన ఐదేళ్లలో నాడు ప్రతిపక్ష నేతలుగా ఉన్న చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ లను విమర్శించేందుకే నాటి పర్యాటక శాఖ మంత్రి పనిచేశారన్నారు. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి చేద్దామన్న ఆలోచన చేయలేదని విమర్శించారు. తద్వారా పర్యాటక రంగం కుంటుపడిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పర్యాటక రంగంపై ప్రత్యేక శ్రద్ధ వహించిందని, త్వరలోనే రాష్ట్రాన్ని పర్యాటకుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.