సచివాలయంలో సినిమాటోగ్రఫీ శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి : సంబంధిత ప్రతిపాదనలతో రావాలని ఉన్నతాధికారులకు సూచించిన మంత్రి కందులదుర్గేష్ సమగ్ర నివేదిక వచ్చాక సినిమా రంగంతో చర్చిద్దామని అధికారులకు మంత్రి దుర్గేష్ సూచన, ప్రతిసారి సినిమా టికెట్ల రేట్ల పెంపు నిర్ణయం తీసుకునే విషయమై అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి కందుల దుర్గేష్
అమరావతి: ఫిల్మ్ పాలసీ తీసుకొచ్చే దిశగా రాష్ట్రం ముందడుగు వేస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. బుధవారం వెలగపూడి సచివాలయం రెండో బ్లాక్ లోని తన ఛాంబర్ లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని పాలసీల మాదిరిగానే ఫిల్మ్ పాలసీకి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. త్వరలోనే సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తులతో సమావేశం నిర్వహించాలన్న అంశం ప్రస్తావనకు తీసుకురాగా అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. సమగ్ర నివేదిక రూపొందించాక సినిమా రంగంతో భేటీ అయి చర్చిద్దామన్నారు. ప్రతిసారి సినిమా టికెట్ల రేట్ల పెంపు నిర్ణయం తీసుకునే విషయమై అధికారులకు మంత్రి కందుల దుర్గేష్ పలు సూచనలు చేశారు. ఏ రకంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. దీర్ఘకాలికంగా ఒక విధానం ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేశారు. దీనిపై అధ్యయనం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ పరిణామ క్రమాన్ని, చెన్నై నుండి హైదరాబాద్ కు తరలివచ్చిన అంశాన్ని మంత్రి అధికారులకు వివరించారు. రాష్ట్రంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ఏపీలో స్టూడియోల నిర్మాణం, డబ్బింగ్ థియేటర్స్, రీరికార్డింగ్ థియేరట్ల ఏర్పాటు అంశం ఈ సందర్భంగా ప్రస్తావనకు రాగా మంత్రి సావధానంగా విన్నారు. రాష్ట్రంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అధికారులకు తెలిపారు. సమావేశంలో హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్, హెం శాఖ స్పెషల్ సెక్రటరీ విజయ్ కుమార్, ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎఫ్ డీసీ) ఎండీ హిమాన్షు శుక్లా, ఎఫ్ డీసీ జనరల్ మేనేజర్ ఎంవీఎల్ఎన్ శేషసాయి తదితరులు పాల్గొన్నారు.