గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందనీ ప్రస్తుతం వాటిని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్లు కృషి చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. నిర్వీర్యమైపోయిన విద్యుత్ డిస్కంలను సైతం ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపు కోరుతూ శుక్రవారం తణుకు పట్టణ పరిధిలోని పైడిపర్రులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత అయిదేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్వీర్యమైపోయిన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్లు విశేష కృషి చేస్తున్నట్లు చెప్పారు. అన్ని వర్గాలపై ధరలు పెంచి బాదుడే బాదుడు అన్నచందంగా వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను 9 సార్లు పెంచిందని గుర్తు చేశారు. చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచకుండా 2025–26 సంవత్సరానికి సంబంధించి విద్యుత్ ఛార్జీలు పెరగవని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. 2014–19 మధ్యకాలంలో చంద్రబాబునాయుడు విద్యుత్ ఛార్జీలను పెంచకుండా పరిపాలన సాగించారో అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఛార్జీలు పెంచకుండా ముఖ్యంగా పేద, దిగువ, మధ్యతరగతి కుటుంబాలపై భారం వేయకుండా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ భారం ప్రజలపై వేయబోమని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ సంస్థలను నిర్వీర్యం చేసినప్పటికీ వచ్చిన నష్టాలను ప్రభుత్వమే భరించి డిస్కంలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఎక్కడికి వెళ్లినా కూటమి ప్రభుత్వంపై ప్రజలు సానుకూలంగా ఉన్నారనే విషయం అర్థమవుతోందని చెప్పారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపు తథ్యమని గ్రాడ్యుయేట్లు ముక్తకంఠంతో చెబుతున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
