అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంఎన్నికల ప్రచారంలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ
గ్రూప్–2 మెయిన్స్ పరీక్షలను అభ్యర్థుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం వాయిదా వేసిందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం జరగాల్సిన గ్రూప్–2 పరీక్షల్లో రోస్టర్ విధానంలో లోపాలున్నాయంటూ అభ్యర్థులు చేసిన విన్నపాలను పరిగణనలోకి తీసుకుని పరీక్షలు వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేఖ రాసినట్లు చెప్పారు. రాబోయే అయిదేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపు కోరుతూ శనివారం తణుకు పట్టణంలోని 11వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్లు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను మెచ్చిన ప్రజలు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బలపరచిన అభ్యర్థికే తమ ఓటు వేస్తామని ముక్తకంఠంతో చెబుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు చేపట్టబోయే కార్యక్రమాలకు అండగా ఉంటామని ప్రజలు భరోసా ఇస్తున్నట్లు చెప్పారు. యువత భవిష్యత్తు లక్ష్యంగా ముఖ్యంగా వారికి ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 4.70 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో పెట్టుబడులు తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈనెల 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా పట్టభద్రులను ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, అరకు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ కార్పొరేషన్ చైర్మన్ కిడారి శ్రవణ్ కుమార్, డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేషు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.