ప్రమాధ భీమాను ప్రభుత్వం పునరుద్దరించాలి – సిఎం సహాయనిధి నుంచి నిధులు కేటాయించాలి
జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తన పరిధి మేరకు సహాయం కూడా చేస్తున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం అక్కయ్యపాలెం జంక్షన్ వద్ద ఒక ప్రయివేటు కార్యాలయంలో పలువురు జర్నలిస్టులకు గంట్ల శ్రీనుబాబు చేతులు మీదుగా రూ.55 వేలు ఆర్ధిక సహాయం అందించారు. తాను సొంతంగా యూనియన్ లకు అతీతంగా వీటిని జర్నలిస్టులకు అందజేసామన్నారు. ఇటీవలే తీవ్ర అనారోగ్యానికి గురై కోలుకున్న సీనియర్ పాత్రికేయులు, కవి, రచయిత బి.ఎస్. చంద్రశేఖర్ కు రూ.15వేలు, అలాగే పాతనగరంలో హిందూరీడింగ్ రూమ్ వద్ద నివాసముంటున్న పైలా అర్జునరావు కుమార్తె అనారోగ్యానికి గురికావడంతో వారికి రూ.15వేలు సహాయాన్ని శ్రీనుబాబు అందజేశారు. అలాగే విశాఖ వాయిస్ లో విధులు నిర్వహిస్తున్న పాత్రికేయుడు వెంకటేష్ మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులకు రూ.10 వేలు ఆర్ధిక సహాయం అందజేశారు. మరో సీనియర్ పాత్రికేయుడికి రూ.15వేలు అందజేసినట్లు శ్రీనుబాబు చెప్పారు. జర్నలిస్టులందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఒక వైపు విధులు నిర్వహిస్తూనే మరో వైపు తమ ఆరోగ్యాన్ని, కుటుంబాలను కూడా కాపాడుకోవాలని పేర్కొన్నారు. కరోనా సమయంలో సైతం తాను సొంతంగా జర్నలిస్టులకు నిత్యవసర వస్తువులతో పాటు వేర్వేరు రూపాల్లో సహాయం చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా రెండు దశాబ్ధాలుగా తన పరిమితి మేరకు జర్నలిస్టులకు అండగా ఉంటూ తనకు తోచిన రీతిలో సహాయ పడుతున్నట్లు చెప్పారు. ఇక కూటమి ప్రభుత్వం జర్నలిస్టులకు ప్రమాధ బీమా సదుపాయం పునరుద్దరించాలని అలాగే సిఎం సహాయ నిది నుంచి ఆర్ధిక సహాయం అందించే విధంగా దృష్టిసారించాలని శ్రీనుబాబు కోరారు. వాటివల్ల జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు చాలాభరోసా కలుగుతుందన్నారు.