- కంచర్ల కు కళామిత్ర బిరుదు ప్రధానం
- పోస్టర్ విడుదల చేసిన సీపీ శంఖ బ్రత బాగ్చి
ఈనెల 24 న జరగనున్న ఘంటసాల స్వర నీరాజనం శీర్షికన జరగనున్న ఘంటసాల సినీ సంగీత విభావరిని విజయవంతం చేయాలని విశాఖ పోలీసు కమీషనర్ శంఖబ్రత బాగ్చి కోరారు. కార్యక్రమ వివరాలతో రూపొందించిన వాల్ పోస్టర్ ను శనివారం ఉదయం సూర్యాబాగ్ లో సీపీ తన చాంబర్ లో విడుదల చేసి మాట్లాడారు. అనంతరం ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్.ఎన్.కె మహంతి, చెన్నా తిరుమలరావులు మాట్లాడుతూ అమరగాయకుడు ఘంటసాల 51 వర్ధంతిని పురస్కరించుకొని ఈ నెల 24 న సాయంత్రం 6 గంటల నుండి ద్వారకా నగర్ విశాఖ పౌర గ్రంధాలయంలో ఘంటసాల స్వర నీరాజనం ఏర్పాటు చేశామన్నారు. సినీ, కళా, సామాజిక సేవా రంగాలకు సేవలందిస్తున్న డా. కంచర్ల అచ్యుతరావును కళామిత్ర బిరుదు ప్రధానం చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రముఖ సంగీత విద్వాంసుడు చిప్పాడ సోమేశ్ సంగీత నిర్వహణలో ఘంటసాల సినీ సంగీత విభావరి ఏర్పాటు చేశామని చెన్నా పేర్కొన్నారు. కార్యక్రమంలో సినీ, కళా, రాజకీయ ప్రముఖులు పాల్గొంటారన్నారు. వివిధ సాంస్కృతిక సంఘాల ప్రతినిధులు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.