మహిళల ముందడుగుతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని విశాఖ నగర సిపి డాక్టర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ముందడుగు9 న్యూస్ ఆధ్వర్యంలో బుధవారం దాబాగార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఉమెన్స్ డే సందర్భంగా వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన పలువురు మహిళలను అతిధుల చేతుల మీదుగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
నేటి సమాజంలో జరుగుతున్న అరాచకాలను దృష్టిలో ఉంచుకుని మహిళలు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకుంటే వారు తమ హక్కులనే కాకుండా సాటి మహిళల హక్కులను రక్షించడానికి తోడ్పడవచ్చని తెలిపారు. సమాజంలో నేడు మహిళలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని, ఏ సమస్యొచ్చినా ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రోజురోజుకూ మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని, వాటి నివారణకు విద్యార్థినులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. గతంలో ఇంటికే పరితమైన మహిళలు నేడు ఎదురులేని నారీ శక్తిగా మారారని కొనియాడారు. మహిళలు ఐక్యంగా ఉంటూ ఒకరికొకరు తోడ్పాటు అందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మ కుమారి సోదరి రమ, దయ హాస్పిటల్ ఫౌండర్ పద్మజ, జనసేన నాయకులు ఇనకోటి కొండలరావు, తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్, కార్యక్రమ నిర్వాహకులు
ముందడుగు9 న్యూస్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
