ఓబిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్
దేశంలో 52శాతం జనాభా కలిగిఉన్న బీసీల అభివృద్ధికోసం కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధి తో పనిచేయాలని ఓబిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. అఖిల భారత ఓబిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తులసిపాటి కృష్ణంరాజు ఆధ్వర్యంలో విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో జంతువులు, మైనార్టీలు, గిరిజనులు, దళితుల అభివృద్ధికి మంత్రిత్వ శాఖలు ఉన్నాయని, కేంద్రంలో జనాభా ప్రాతిపదికన బీసీల అభివృద్ధి కి ప్రత్యేక మైన మంత్రిత్వ శాఖ లేదన్నారు. ఓబీసీ అని చెప్పుకుని తిరిగే ప్రధాని బీసీ వర్గాలకోసం ఏమి చేశారో చెప్పాలన్నారు. ఓబీసీ కోసం ప్రత్యేక మైన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకపోవడం దారుణం అని, బీసీ, ఓబీసీ లు ఈ దేశ పౌరులు కాదా అంటూ ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాల్లో చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఆర్.కృష్ణయ్య చట్టసభల్లో బీసీల అభివృద్ధికి రిజర్వేషన్లు కల్పించాలని పలుపర్యాయలు తన గళం విప్పారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం బీసి రిజర్వేషన్లు అమలు చేయడంలో మౌనం వహిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై తీర్మానం చేయడం హర్శించదగ్గ విషయం అని తెలిపారు. రాష్ర్టంలో స్థానిక సంస్థల్లో ఉన్న 34 శాతము ఉన్న రిజర్వేషన్ల శాతాన్ని 44 శాతానికి పెంచాలన్నారు. బీసీల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కోరారు. మే 3 నుండి నెల రోజులపాటు బీసీల ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు సాధనకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టబోతున్నామని వెల్లడించారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి తణుకు సత్య వరప్రసాద్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కణితి మల్లేశ్వరి, యువజన విభాగం కార్యదర్శి చంద్రశేఖర్, విశాఖ అధ్యక్షుడు ప్రదీప్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.