గతంలో జేబు సంస్థగా పోలీసు వ్యవస్థను వాడుకున్నారు
ఇప్పుడు అదే అధికార మదంతో వ్యాఖ్యలు చేస్తున్నారు
నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే చూస్తూ ఊరుకోం
15 ఏళ్లపాటు కూటమి అధికారంలో ఉంటుంది
జగన్, కారుమూరి వ్యాఖ్యలపై తణుకు ఎమ్మెల్యే ధ్వజం
విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి, తణుకు నియోజకవర్గంలో కారుమూరి వెంకటనాగేశ్వరరావు అధికారంలో ఉన్నప్పుడు అధికార మదంతో ఏమి మాట్లాడినా చెల్లుతుందనే అహంకారంతో ప్రజల్ని చులకనగా మాట్లాడిన పరిస్థితులు ఉంటే ఇప్పుడు అధికారం కోల్పోయినప్పటికీ మరోసారి ఒళ్లు కొవ్వు ఎక్కినట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ధ్వజమెత్తారు. అధికార మదంతో రైతులను, టిడిపి నేతలు, కార్యకర్తలను దుర్భాషలాడిన మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావును తణుకు నియోజకవర్గ ప్రజలు తిరస్కరించి ఓటమి రుచి చూపించినప్పటికీ ఇంకా నోటి దురద తగ్గించుకోలేదని విమర్శించారు. శుక్రవారం తణుకు కూటమి కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమవేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. పోలీసులను బట్టలు విప్పి కొడతామని జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యలు చేయడం చూస్తే ఆనాడు అధికారంలో ఉండగా ఎంపీలు సైతం బట్టలు విప్పి చూపించారని ఎద్దేవా చేశారు. అధికారం పోయినప్పటికీ అధికార మదంతో మళ్లీ అధికారం వస్తుందని పగటి కలలు కంటూ గుడ్డలు విప్పేస్తామంటూ వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారని అన్నారు. ఆనాడు పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని అనేక మందిపై అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టించి రఘురామకృష్ణంరాజుపై పోలీసులతో చేయించిన దాడిని రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదన్నారు. పోలీసు వ్యవస్థను ఆనాడు జేబు సంస్థగా మార్చుకుని అధికార దుర్వినియోగానికి జగన్మోహన్రెడ్డి పాల్పడ్డారని అన్నారు. తన ఉనికిని కాపాడుకోవడానికి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వైసీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ మళ్లీ అధికారం వేస్తే టిడిపి నాయకులను ఇళ్లలోంచి లాక్కొచ్చి కొడతామని, నరుకుతామని బెదిరిస్తే బెదిరిపోయేంత పిచ్చోళ్లు ఎవరు లేరని అన్నారు. ఒళ్లు బలిసి, కొవ్వు ఎక్కువై కొట్టుకుంటున్నావని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఒకప్పుడు అధికారంలో ఉండి ఒళ్లు బలుపుతో చేసిన రాజకీయం మళ్లీ చేద్దామని ప్రయత్నిస్తే ప్రజలు సహించబోరన్నారు. రాష్ట్రంలో మళ్లీ వైఎస్ఆర్సీపీ గెలవదనీ ఇదే సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ మంత్రి కారుమూరి గెలవబోరని స్పష్టం చేశారు. కనీసం 15 ఏళ్లపాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలని, ఏది పడితే అది మాట్లాడితే కుదరదని కారుమూరికి హితవు పలికారు. రాబోయే రోజుల్లో కారుమూరిని రోడ్లుపై తిరగనివ్వబోరని రోడ్డుపైకి తీసుకువచ్చి కొట్టి దొర్లించే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. రౌడీయిజం చేద్దామంటే ఎలా అడ్డుకోవాలో కూటమి నాయకులు, కార్యకర్తలకు తెలుసని చెప్పారు. ఇప్పటికైనా పద్ధతి ప్రకారం బుద్ధి తెచ్చుకుని ప్రవర్తన మార్చుకోవాలని ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలన్నారు. అవినీతి సంపాదనతో తలకెక్కిన అహంతో అధికారంలో ఉండగా టీడీఆర్ బాండ్లు పేరుతో, కరోనా పేరుతో ప్రజల్ని దోచుకున్నారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఒక ప్రతిపక్ష పార్టీగా వైసీపీ నేతలు చేస్తున్న రాజకీయాలతోపాటు ఇటీవల చేసిన రాజకీయాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. అంతకు ముందు మాజీ మంత్రి కారుమూరి గతంలో రైతులు, మహిళలను దుర్భాషలాడిన వీడియోలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.