జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా ‘కూటమి’ – పూలే జయంతి వేడుకల్లో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ
కుల వ్యవస్థకు, కుల అహంకారానికి పునాదులు వేసిన మనుస్మృతికి వ్యతిరేకంగా పోరాటం చేసి సమాజంలో కుల వ్యవస్థను నిర్మూలించడానికి కృషి చేసిన వ్యక్తి అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. సంఘ సంస్కరణలకు నాంది పలికి ముఖ్యంగా విద్యాసంస్థలను నెలకొల్పి ప్రతి ఒక్కరు చదువుకోవాలని ఆకాంక్షించిన వ్యక్తి పూలే అని కొనియాడారు. జ్యోతిరావుపూలే జయంతి పురస్కరించుకుని తణుకులోని రాష్ట్రపతి రోడ్డులోని పూలే విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. దేశంలో మహాత్మా అనే బిరుదు ఇద్దరికి మాత్రమే ఉందని ఒకరు మహాత్మా గాంధీ అయితే రెండోది మహాత్మా జ్యోతిరావుపూలే అని అన్నారు. జ్యోతిరావు పూలే మహారాష్ట్రలో జన్మించి అనేక సంఘసంస్కరణలకు మార్గదర్శకులుగా నిలిచారని కొనియాడారు. ప్రధానంగా మహిళలు చదువుకోవాలని ఆనాడు సతీమణి సావిత్రిబాయి పూలే చదువుకోవడానికి మొదటి బాలికల స్కూలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. విద్యావ్యవస్థలో మహిళలకు ప్రధాన పాత్ర కల్పించిన మహనీయుడన్నారు. సమాజంలో అన్ని కులాలు సమానమని చెబుతూ సమసమాజ స్థాపనే లక్ష్యంగా పని చేసిన జ్యోతిరావుపూలే ఆశయసాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం సైతం పూలే ఆశయాలకు అనుగుణంగా సమాజంలో అన్ని కులాలు, వర్గాలకు సమన్యాయం చేస్తూ సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకమారావు సైతం పూలే ఆశయాలకు అనుగుణంగా అన్ని కులాలకు రాజకీయ అవకాశాలు కల్పించే విధంగా ఎంతో మంది చదువుకున్న వారిని రాజకీయాల్లో రాణించే విధంగా కృషి చేశారన్నారు. పేదరికం లేని సమాజం నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అంతకుముందు కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాధాకృష్ణ పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.