టీడీపీ కార్యాలయం ఎమ్మెస్సెస్ భవన్లో కూటమి నేతలు సమీక్ష సమావేశం
పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ
అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి మే 2న రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారని, ఆ పర్యటనను కూటమి నాయకులు విజయవంతం చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. సోమవారం టీడీపీ కార్యాలయం ఎమ్మెస్సెస్ భవన్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్, తణుకు ఎమ్మెల్యే, మంగళగిరి నియోజకవర్గం పరిశీలకులు అరిమిల్లి రాధాకృష్ణ సమీక్షా సమావేశం నిర్వహించారు. జనసమీకరణ, వాహనాల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బాధ్యతగా భావిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. గతంలో మోదీ పర్యటనలకు మించి విజయవంతం చేయడానికి కృషి చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ప్రధాని మోదీ పర్యనకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మే 2న రాజధాని అమరావతిలో రూ. లక్ష కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విధ్వంసానికి గురైన అమరావతి రాజధాని అభివృద్ధిని తిరిగి పట్టాలు ఎక్కించేందుకు ప్రధాని మోదీ చేతుల మీదుగా మరోసారి కూటమి ప్రభుత్వం అమరావతి 2.0 కు శ్రీకారం చుట్టిందన్నారు. అమరావతి రాజధాని ప్రపంచంలోనే తొలి సోలార్ నగరంగా చరిత్ర సృష్టించబోతుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని పనులు పరుగులు పెడుతున్నాయని అన్నారు. జగన్ రెడ్డి నిర్వాకం వల్ల రూ. 2 లక్షల కోట్ల విలువైన 130 పరిశ్రమలు, ప్రఖ్యాత వ్యాపార, విద్యాసంస్థలు పొరుగు రాష్ట్రాలకు తరలి పోవడంతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆరోపించారు. రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ఆధ్వర్యంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నారన్నారు.
ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు. దేశమంతా గుర్తించేలా అమరావతి నిర్మాణం జరుగుతుందని చెప్పారు. 175 నియోజకవర్గాలకు ఉద్యోగ కల్పవల్లిగా అమరావతి అభివృద్ధి చెందుతుందన్నారు. అమరావతి నిర్మాణానికి ప్రపంచబ్యాంకు, ఏడీబీల నుంచి రూ. 15 వేల కోట్ల రుణం మంజూరైందని, జర్మనీకి చెందిన డెవలప్మెంట్ బ్యాంకు కేఎఫ్‌డబ్ల్యూ నుంచి రూ.5 వేల కోట్లు, హడ్కో నుంచి రూ. 15,400 కోట్లు రుణాలు కల్పించడం హర్షణీయమన్నారు. అమరావతిని రాజధానిగా నిర్మిస్తే కృష్ణా, గుంటూరు జిల్లాలు మాత్రమే అభివృద్ధి చెందుతాయి. ఇతర రాష్ట్రాల అభివృద్ధి గాఢిన పడుతుందని వైసీపీ పెయిడ్ ఆర్టిస్ట్ ల ద్వారా దుష్ప్రచారం చేయించడం సిగ్గుచేటని ఆరిమిల్లి రాధాకృష్ణ మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, ఏపీ పద్మశాలీ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పంచుమర్తి ప్రసాద్(చిన్న) నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్, దుగ్గిరాల మండల పార్టీ అధ్యక్షులు కేసంనేని శ్రీఅనిత, తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు, జనసేన ఎంటీఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు, పట్టణ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు, ప్రధాన కార్యదర్శులు షేక్ రియాజ్, తాళ్ళ అశోక్ యాదవ్, ధారా దాసు, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు, నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి, క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు, కూటమి నాయకులు పాల్గొన్నారు.