తణుకులో ఘనంగా వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలు
తణుకులో నివాళులు అర్పించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వంగవీటి మోహనరంగా నిరంతరం కృషి చేశారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. వంగవీటి మోహనరంగా 78వ జయంతి పురస్కరించుకుని శుక్రవారం తణుకు వెంకటేశ్వర థియేటర్ సెంటర్ వద్ద రంగా విగ్రహానికి పూలమాలలు వేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సేవలో కులమతాలకు అతీతంగా ముఖ్యంగా పేదల అభివృద్ధి కోసం కృషి చేస్తూ సామాజిక న్యాయం కోసం రంగా అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో సమాజ సేవలో ముఖ్యంగా పేదలకు అండగా నిలబడిన మోహనరంగా స్థానం ప్రత్యేకమని పేర్కొన్నారు. నేటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మోహనరంగా నిలిచిపోయారని పేర్కొన్నారు. పేదల అవసరాలకు ఎప్పుడు నిలబడుతూ వారికి అండగా ఉంటూ ఎక్కడ పేదలకు అన్యాయం జరిగితే ఆయన నేనున్నానంటూ నిలిచే వారిని అన్నారు. ఎంతోమందికి ముఖ్యంగా యువతకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. ఆయన చేసిన పోరాటాలు ప్రజలకు స్ఫూర్తిని ఇస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.