గత వైసీపీ హయాంలో పంట కాలువలు నిర్లక్ష్యం

రైతు సంక్షేమానికి కట్టుబడిన కూటమి ప్రభుత్వం

కూటమి అధికారంలోకి వచ్చాక ప్రక్షాళనకు చర్యలు

గోస్తనీ నదిలో కిక్కిస తొలగింపు పారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ

గత అయిదేళ్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ హాయంలో కనీసం గుర్రపు డెక్క తొలగింపు లేదా కాలువల ప్రక్షాళన చేపట్టకపోవడంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంట కాలువల ప్రక్షాళన కోసం ప్రణాళికలు సిద్ధం చేసి రైతులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రైతు సంక్షేమానికి కట్టుబడిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు. సోమవారం తణుకు మండలం వేల్పూరు నుంచి పెనుమంట్ర మండలం ఎస్‌.ఇల్లిందలపర్రు వరకు గోస్తనీనది ప్రధాన పంట కాలువలో పేరుకుపోయిన కిక్కిస తొలగింపు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మట్లాడారు. ప్రధాన పంటకాలువలు, డ్రైనేజీలకు సంబంధించి నీటి సంఘాలను ఏర్పాటు చేసి కింది స్థాయిలో నీటి సంఘాల సభ్యుల నుంచి జిల్లా స్థాయిలో పీసీ ఛైర్మన్ల వరకు పంటకాలువలు, డ్రైనేజీలు ప్రక్షాళన చేసి గుర్రపుడెక్క, కిక్కిస తొలగించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. గత అయిదేళ్లలో చేయలేని పనులను ఏడాదిలోనే పూర్తి చేసే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో జిల్లా రైతులకు రాబోయే ఖరీఫ్‌ నాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించేందకు చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. గత కొన్నేళ్లుగా తణుకు, ఆచంట నియోజకవర్గాల మీదుగా వెళుతున్న ప్రధాన పంట కాలువ గోస్తనీ నదిలో తూడు పెరిగిపోవడంతో కింది గ్రామాల్లో రైతులకు సాగునీరు అందకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పీసీ ఛైర్మన్‌ మురళీకృష్ణంరాజు ఆధ్వర్యంలో కిక్కిస తొలగింపు కోసం ప్రత్యేక ప్రణాళికలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఆచంట నియోజకవర్గ యువ నాయకులు పితాని వెంకట్, పీసీ ఛైర్మన్‌ మురళీకృష్ణంరాజు, నీటి సంఘం అధ్యక్షులు దొమ్మేటి భాస్కరరావు, ఇరిగేషన్‌ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link