తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకొని కోట నిర్మించుకొన్న మహానటుడు కోట శ్రీనివాసరావు

ప్రముఖ నటులు, పద్మశ్రీ గ్రహీత కోట శ్రీనివాసరావు మరణం బాధాకరం

:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ కోట శ్రీనివాసరావు

ఆయన పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించిన మంత్రి కందుల దుర్గేష్

అమరావతి: ప్రముఖ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మృతిపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సంతాపం వ్యక్తం చేశారు.కోట శ్రీనివాసరావు మృతిపై ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని, ఆయన పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు.

ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకొని కోట కట్టుకున్న మహానటుడు కోట శ్రీనివాసరావు అని అభివర్ణించారు. ఆయన మరణం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.కోట మరణవార్త తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యాను అని ప్రకటనలో పేర్కొన్నారు. కోట శ్రీనివాసరావు మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటన్నారు. విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన శైలిలో నటించిన కోట శ్రీనివాసరావు తండ్రిగా, తాతగా, రాజకీయనాయకుడిగా, పిసినారిగా, పోలీసుగా ఇలా అద్భుతమైన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్నారని తెలిపారు. ప్రఖ్యాత నటులు ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ, రావుగోపాలరావుల శకం తర్వాత ఆ లోటును భర్తీ చేసిన గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు అన్నారు. నటనలో తెలుగునాట చెరిగిపోని ముద్ర కోట శ్రీనివాసరావుదని, ఆయన నటన చిరస్మరణీయమన్నారు. తెలుగు చలనచిత్ర రంగంలో ప్రముఖ నటుడిగా, తెలుగు రాజకీయాల్లో రాజకీయ నాయకుడిగా రాణించారని వివరించారు. తమిళనం, కన్నడం, హిందీ, మళయాళం తదితర భాషల్లో నటించి నాలుగు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో పోషించిన ప్రతి పాత్రకు న్యాయం చేసిన మహానటుడు కోట శ్రీనివాసరావు అని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున వంటి అగ్ర హీరోలతో పాటు యువ హీరోలతోనూ ఆయన నటించి మెప్పించారని, ఆయన వైవిధ్య భరితమైన నటనకు నంది, సైమా వంటి ఎన్నో సినీ అవార్డులు దాసోహం అయ్యాయాన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం సైతం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించిందన్నారు.

Scroll to Top
Share via
Copy link