పూర్వం ఇప్పుడున్న ఆలయ ప్రాంగణంలో ఉన్న చెరువు సమీపంలో ఒక పెద్ద పాముపుట్ట ఉండేదట. అందులో దివ్యమైన తేజస్సు గల ఒక సర్పం నిత్యం ఆ పుట్టలోకి వెళ్లడం రావడం ఇక్కడి వారు చూసేవారట – మాములుగా మన ఇంట్లో కి వస్తే తప్ప లేకుంటే పాముని మనం పవిత్రంగా పూజిస్తాం కాబట్టి ఆ భావన కలగడం వలన గ్రామస్థులు ఎవరూ కూడా దానికి హాని తలపెట్టలేదట – కొన్ని రోజులకి ఆ చెరువులో నీరు పెరగడం వలన ఆ పుట్ట నీటిలో కలిసిపోయిందట … తర్వాత ఆ పాము విషయం కూడా అందరూ మర్చిపోయారు. కొంతకాలానికి చెరువుకి సంబంధించిన మరమ్మత్తుల పనులు చేపట్టగా అక్కడ ఉండే పుట్ట ప్రదేశంలో నుంచి ఏకశిలపై స్వామి వారి సుందర మనోహర విగ్రహం బయట పడింది అని చెప్తారు ఇక్కడివారు. ఈ విగ్రహం సుమారు రెండు అడుగుల ఎత్తుతో స్పష్ట ఆకృతితో స్వామి తేజరిల్లుతుంటాడు … అప్పుడు గ్రామస్తులు ఏకమై ఆలయాన్ని నిర్మించారట … స్వామి వారి దేహం సర్పంవలె పొలుసులతో కూడి వుండటం ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత …. మాములుగా అత్తిలి అనగానే ముందు చెప్పేది సుబ్రహ్మణ్య స్వామి వారి షష్టి ఉత్సవాలు … సుమారు 80 సంవత్సరాల నుండి ఇక్కడ షష్ఠి ఉత్సవాలు జరుపుతున్నారు. ఒకప్పుడు నెల రోజుల పాటు రోజు వివిధ కార్యక్రమాలతో ఉత్సవాలు జరిగేవి ఇప్పుడు అంతా మరిపోయిందిగా మహా అయితే పది లేదా పదిహేను రోజులు జరుపుతున్నారు. ఆ షష్టి లో అమ్మే ” జీళ్ళు ” అమోఘం అసలు భలేఉంటాయి. అత్తిలి షష్టికి వెళ్లారు అంటే ఖచ్చితంగా జీళ్ళు కొంటారు.