విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన ఓ కిడ్నీ బాధితుడికి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సహాయ సహకారాలందజేసి పునర్జన్మ అందించారు. ఆశీలమెట్ట కార్యాలయంలో మంగళవారం ఉదయం దంపతులిద్దరూ వాసుపల్లి గణేష్ కుమార్ ను కలిసి స్వీట్స్ పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా బాధితుడి భార్య షర్మిల మాట్లాడుతూ 29వ వార్డు ఆంతోనీ నగర్ కలకత్తా వీధికి చెందిన పోతున చంద్రశేఖర్, షర్మిల దంపతులు ఇద్దరు ఆడపిల్లలతో సంతోషంగా ఉండేవారమన్నారు. కాగా తన భర్త రెండు కిడ్నీలు పాడైపోవడంతో చనిపోయే స్థితికి వచ్చారని, మూడేళ్లుగా పిల్లలను బంధువులకు అప్పజెప్పి తన భర్తను బతికించుకోవడానికి ఎంతోమంది కాళ్లు పట్టుకున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. వార్డు అధ్యక్షుడు పీతల వాసు సహకారంతో తమ దేవుడు వాసుపల్లి గణేష్ కుమార్ ను కలిశానన్నారు. వెంటనే కేజీహెచ్ లో కిడ్నీ మార్పిడి కోసం జరిగే మెడికల్ బోర్డుతో మాట్లాడి, ఎమ్మెల్యేగా వాసుపల్లి ఇచ్చిన లేఖతో తన భర్త తిరిగి పునర్జన్మ అందుకున్నాడని షర్మిల ఆనందం వ్యక్తం చేశారు. వాసుపల్లి గణేష్ కుమార్ అందించిన సహాయ సహకారాలకు కాళ్లు కడిగి నీళ్లు జల్లు కోవాలని బాధితురాలు భావొగ్వేదానికి లోనైంది. ఆరోగ్యం కుదుటిపడిన తన భర్తతో కలిసి వాసుపల్లిని కలవడం ఎంతో ఆనందం కలిగించిందని వెల్లడించారు. అలాగే తన పిల్లలు తన వద్దకు చేరుకున్నారని ప్రస్తుతం కుటుంబంతో ఆనందంగా గడపడానికి వాసుపల్లి గణేష్ కుమార్ కారణమని షర్మిల తెలియజేసింది. ఈ కార్యక్రమంలో 29వ వార్డు వైసిపి అధ్యక్షుడు పీతల వాసు, కళింగ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సనపల భరత్, 33 వార్డు అధ్యక్షుడు ముత్తా బత్తుల రమేష్, మహేష్, సాగర్, తదితరులు పాల్గొన్నారు.