ప్రజా ఆరోగ్య సంరక్షణలో చిరు వ్యాపారులే తొలి వైద్యులు – జిల్లా కలెక్టర్

శుచి, నాణ్యతతో కల్తీ లేని ఆహారాన్ని అందించడంలో మీ వంతు బాధ్యత నెరవేర్చాలి.. సమాజ ఆరోగ్యమే మీ ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటునిస్తుంది. టెస్టింగ్ సాల్ట్, ఫుడ్ కలర్స్, మరిగిన నూనెలు తదితర పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించరాదు. ఫిబ్రవరి ఒకటీ నుండి ఆహార తనిఖీలు ఉంటాయి.. తొలిదశలో టీ స్టాల్స్ నందు డిస్పోజబుల్ గ్లాసులు నిషేధం, వాటిస్థానంలో గ్లాసులు వినియోగించాలి, డిస్పోజబుల్ గ్లాసులు, క్యారీ బ్యాగులు, పేపర్ ప్లేట్స్ ఫిబ్రవరి 1 నుండి నిషేధం: చిరు వ్యాపారులు లాభసాటి వ్యాపారంతో ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించేందుకు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ చడలవాడ నాగరాణి అన్నారు. శనివారం తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం నందు స్వచ్ఛత, కల్తీలేని ఆహారంపై చిరు వ్యాపారులతో (బండ్లపై ఆహార పదార్థాలు అమ్మేవారు) ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లాకలెక్టర్ చదలవాడ నాగరాణి, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ శుచి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకు చిరు వ్యాపారులు తమ వంతు కృషి చేయాలని సూచించారు. స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నేటి నుండి ప్రారంభించడం జరిగిందని, ఈ కార్యక్రమం 12 నెలల పాటు ప్రతినెల మూడో శనివారం పరిసరాలు పరిశుభ్రత, ప్లాస్టిక్ నిషేధం, కల్తీ లేని ఆహార పదార్థాలు తదితర అంశాలపై కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. పరిశుభ్రతపై ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎక్కువ కాలం జీవించాలన్న, ఆరోగ్యవంతంగా ఉండాలన్న నాణ్యమైన ఆహారాన్ని స్వీకరించాల్సిన అవసరం ఉందన్నారు. భారతదేశం ఆహార వంటకాల్లో ప్రత్యేక స్థానం ఉందని, ప్రస్తుత పాశ్చాత్య పోకడలతో ఇంటి వంటలకు దూరంగా అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడం జరుగుతుందన్నారు. చిరు వ్యాపారులు కల్తీ లేని నూనెలు, ఆహార పదార్థాలతో తయారుచేసిన ప్లాస్టిక్ రహిత వస్తువులలో అందించాలని సూచించారు. కలుషిత ఆహారం వలన పిల్లలు, పెద్దలకు జీర్ణాశయ సమస్యలు, అవయవాలపై దుష్ప్రభావం, అవయవాల నిర్మాణంలో లోపం, పిల్లల ఎదుగుదల లోపం సృష్టిస్తున్నాయని దీనిని ప్రతి ఒక్కరు గమనించాలన్నారు. అనుమతించిన ఫుడ్ కలర్స్ మాత్రమే వినియోగించాలని, ప్లాస్టిక్ ను నిరోధించాలని, టీ హోటల్స్ నందు గాజు గ్లాసులను మాత్రమే వినియోగించాలని సూచించారు. హోటల్స్, బళ్ళుపై విక్రయించే ఆహారపదార్థాల తనిఖీకి ఆర్డిఓ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని, ఫిబ్రవరి 1 నుండి కమిటీ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ కల్తీ ఆహార పదార్థాలు తీసుకోవడం కారణంగా కిడ్నీ, క్యాన్సర్ వంటి రోగాల బారినపడి ఎన్నో కుటుంబాలు ఇబ్బందులను పడుతున్నాయన్నారు. కల్తీ నూనె, టేస్టింగ్ సాల్ట్, ఫుడ్ కలర్స్, పాలల్లో కలితి ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని అన్నారు. టేస్టింగ్ సాల్ట్ నాలుగు సంవత్సరాలుగా తీసుకున్న ఒక వ్యక్తికి కిడ్నీ పోయిందని ఈసందర్భంగా తెలియజేస్తూ టేస్టింగ్ సాల్ట్ ఎట్టి పరిస్థితుల్లో హోటల్స్, చిరు వ్యాపారులు ఆహార పదార్థాలను కల్పవద్దని విన్నవించారు. ఫుడ్ కలర్స్ కారణంగా క్యాన్సర్ బారిన పడుతున్నారని, ఆహార పదార్థాలు ధరలు పెంచి నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే హోటల్స్, చిరు వ్యాపారులు అందించాలని సూచించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన సామాజిక బాధ్యత మీపై ఉందని నిరంతరం గుర్తుంచుకోవాలని కోరారు. నిల్వపెట్టిన పదార్థాలను, మాంసాలను ఎట్టి పరిస్థితుల్లో అమ్మరాదని సూచించారు. ఫిబ్రవరి 1 నుండి తనిఖీలు ఉంటాయని తనిఖీలలో ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గిట్టుబాటు కాకపోతే ధరలను పెంచి ఆహార పదార్థాలు అమ్మకాలు చేపట్టడానికి నా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఆర్డిఓ ఖతీబ్ కౌసర్ భానో, మున్సిపల్ కమిషనర్ ఎం.ఏసుబాబు, రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పి.రఘు, తహసిల్దారులు సునీల్ కుమార్, వై.శ్రీనివాస్, చిరు వ్యాపారులు, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link