ప్రతి నియోజకవర్గానికి అక్రిడేషన్ మంజూరు చేయాలి
ప్రభుత్వ ప్రకటనలతో ప్రోత్సాహం అందించాల్సిందే
రాష్ట్రము లో చిన్న, మధ్య తరహా పత్రికలకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి (ఎన్ఏజే) గంట్ల శ్రీనుబాబు అన్నారు. బుధవారం విశాఖ పౌరగ్రంథాలయంలో ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ విశాఖ యూనిట్ అధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో జర్నలిస్టులంతా తమ సమస్యలను, ఇబ్బందులను తెలియజేశారు. అనంతరం జాతీయ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, ఫెడరేషన్ ఆర్బన్ అధ్యక్షుడు పి. నారాయణ్ లు మాట్లాడుతూ, చిన్న, మధ్య తరహా మాసపత్రికలకు ప్రభుత్వపరంగా న్యాయం చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తామన్నారు. ప్రధానంగా ఎంప్యానెల్మెంట్ తో సంబంధం లేకుండా అక్రిడేషన్ల ప్రక్రియను సులభతరము చేయాలని అలాగే, ప్రతి నియోజకవర్గానికి ఒక అక్రిడేషన్ మంజూరు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. అలాగే, అర్హత ఉన్న పత్రికలకు తప్పనిసరిగా ఎంప్యానెల్మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని కోరుతామన్నారు. అలాగే ప్రభుత్వపరంగా ఏటా చిన్న, మధ్య తరహా పత్రికలకు కూడా అవసరమైన మేరకు ప్రకటనలిచ్చి ప్రోత్సహించాలన్నారు. సమాజంలో పెద్ద పత్రికలతో పాటు చిన్న పత్రికలు కూడా నిరంతరం ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నాయన్నారు. ఇళ్లస్థలాల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. అయితే సమావేశంలో తీర్మానించిన అంశాలను తమ రాష్ట కార్యవర్గం ద్వారా 28న విజయవాడలో కూటమి నేతలకు వినతిపత్రాలు అందజయడంతోపాటు, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, కమిషనర్ కు నివేదిస్తామన్నారు. అలాగే అవసరమైతే మంత్రి నారా లోకేష్‌కు వినతిపత్రం అందజేసి ఆయా సమస్యలను పరిష్కరించాలని కోరడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో స్మాల్ అండ్ మీడియం న్యూస్‌పేపర్స్ అసోసియేషన్ విశాఖ యూనిట్ అధ్యక్షుడు జగన్మోహన్, కార్యదర్శి కె.శ్రీనివాసరావు, బ్రాడ్ కాస్ట్ అధ్యక్షుడు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి కె.మదన్‌తోపాటు చిన్న, మధ్య తరహా పత్రికల నుంచి సుమారు వంద మంది జర్నలిస్టులు, వివిధ పత్రికలకు చెందిన సంపాదకులు, ఆయా ఆసోసియేషన్ల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నేతలు గంట్ల శ్రీనుబాబు, నారాయణను ఘనంగా సత్కరించారు.