రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు నుండి మొదలుకానున్న పదవతరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసిన తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్, బిజెపి లీడర్ శ్రీమతి డా.ముళ్ళపూడి రేణుక, ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు పరీక్షలు ఎదుర్కొనే ముందు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కొన్ని సూచనలను తెలియజేశారు. మొదటి రోజున పరీక్షకు ఒక అరగంట ముందుగానే చేరుకునే విధంగా బయలుదేరాలని పరీక్ష కేంద్రంలో మనకు కేటాయించిన గది, కూర్చోవలసిన సీటు కోసం కొద్దిపాటి కంగారు పడవలసిన సందర్భంగా కాబట్టి ముందుగానే చేరుకుని, ప్రశాంతమైన ఆలోచనలతో పరీక్షకు సిద్ధం కావాలని అన్నారు. ఎటువంటి ఆందోళన చెందకుండా పరీక్ష ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది, పేపరు ఏ విధంగా ఇస్తారు కష్టంగా ఉంటుందా సులభంగా ఉంటుందా అనే ఆలోచనలను మదిలోకి రానీయకుండా ప్రశాంతంగా ఉండాలన్నారు. ఎన్ని మార్కులు వస్తాయి ర్యాంకు ఎంత సాధిస్తానో అనే ఆలోచనను విడనాడి పరీక్షకు సిద్ధం కావాలని అన్నారు. ప్రశాంతమైన ఆలోచనతో ప్రశ్నాపత్రం ఇవ్వగానే పూర్తిగా చదివి, ఆ తర్వాతనే జవాబులు రాయడానికి సిద్దపడాలని, ఈ ప్రశ్నలకైతే సమాధానాలు తొందరగా వ్రాయగలను అని నిర్ధారించుకొని ముందుగా ఆ ప్రశ్నలతో పరీక్ష వ్రాయాలన్నారు. అదేవిధంగా తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు వచ్చే ప్రశ్నలకు ముందుగా సమాధానాలు వ్రాసి అనంతరం మిగిలిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాలని అన్నారు. అంతేకాకుండా ప్రక్కన ఉన్న అభ్యర్థులు ఎక్కువ అడిషనల్ షీట్లు తీసుకుంటున్నారని ఆందోళన చెందకూడదని, ఒక్కొక్కరు ఒక్కో విధానంలో తమ సమాధానాలను ప్రజెంట్ చేస్తారు కావున ఆందోళన చెందకూడదని అన్నారు. ఈరోజు వ్రాసిన పరీక్ష గురించి ఆలోచించకుండా ఈరోజు తోనే పరీక్షకు సంబంధించిన విషయాలను పక్కనపెట్టి మరుసటి రోజు వ్రాయవలసిన పరీక్షకు సిద్ధం కావాలని అన్నారు. పరీక్ష వ్రాసిన వెంటనే ఇంటికి చేరుకుని బాగా హైడ్రేట్ చేసుకొని…. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కారణంగా ఎండలు తీవ్రత కావడం, ఒకవైపు పరీక్షల ఒత్తిడి అధికంగా ఉంటుంది కావున మంచినీరు, మజ్జిగ వంటి వాటిని ఎక్కువగా తీసుకొని ప్రశాంతంగా భోజనం చేసి కొద్దిసేపు పడుకోవాలని అన్నారు. ఇటువంటి సమయాల్లో నిద్ర మనసుకు ప్రశాంతతను కలుగజేస్తుందని పరీక్షా సమయాల్లో రాత్రి వేళ మేలుకొని పరీక్షలకు చదవడం వల్ల మెదడుకు ఒత్తిడి పెరుగుతుందని మెంటల్ బ్రేక్ డౌన్ వస్తుందని, కనీసం 6 గంటల సేపు నిద్ర పోతే మెదడుపై ఒత్తిడి తగ్గి మరుసటి రోజు పరీక్షకు సన్నద్ధం కావచ్చని అన్నారు. మానసిక ప్రశాంతత కొరకు ఎన్నో మీడియాలలో, యూట్యుబ్ చానల్స్ సూచనలు అందిస్తున్నాయని వాటిని పాటిస్తూ , ఉదయం లేవగానే ఎక్కువ నీరు త్రాగాలని, హైడ్రేషన్ లో ఉన్న సమయంలో శక్తి ఎక్కువగా ఉంటుందని ఆమె తెలిపారు. ఈ విధంగా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ సంవత్సరం కాలంలో పరీక్షలకు ప్రిపేర్ అయిన విద్యార్థిని, విద్యార్థులు తమ పరీక్షలను జాగ్రత్తగా వ్రాసి మంచి మార్కులు పొందాలని శుభాకాంక్షలు తెలియజేశారు.
