ప్రపంచ స్థాయిలో లేసు అల్లికలతో నరసాపురానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత స్థానిక మహిళలదే.
కొత్త ఉత్పత్తులు, డిజైన్లు తయారీపై దృష్టి పెట్టి ప్రత్యేక బ్రాండు క్రియేటు చేసి ఆర్థికంగా మహిళలు బలోపేతం కావాలి.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు ద్వారా మహిళలు ఉపాధి అవకాశాలు పొందాలి.
కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర జలవనరులు శాఖ మంత్రి డాక్టరు నిమ్మల రామానాయుడు .
శనివారం నరసాపురం – రుస్తుంబాధ ఇంటర్నేషనల్ లేసు ట్రేడ్ సెంటరులో హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్ పో ప్రారంభోత్సవ వేడుకల్లో కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర జలవనరులు శాఖ మంత్రి డాక్టరు నిమ్మల రామానాయుడు,ప్రభుత్వ విఫ్,స్థానిక శాసనసభ్యులు శ్రీ బొమ్మిడి నాయకర్,ఆచంట శాసన సభ్యులు శ్రీ పితాని సత్యనారాయణ,ఏపి కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కొత్తపల్లి సుబ్బారాయుడు సంయుక్తంగా పాల్గొని, ఎగ్జిబిషన్ స్టాల్స్ ను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ హస్త కళాకారుల ఎగుమతి ప్రోత్సాహక మండలి ( ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ హ్యాండీక్రాఫ్ట్- EPCH) అనే సంస్థను 1986లో ఏర్పాటు చేసి,దేశవ్యాప్తంగా ఉన్న హస్తకళాకారులను ఒక చోటికి చేర్చడం జరిగిందన్నారు. హస్తకళాకారులు తయారు చేసే వివిధ వస్తువులకు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతి చేయడానికి, ఎటువంటి లాభాపేక్ష లేకుండా మద్దతుగా నిలుస్తూ నిరంతరం కృషి చేస్తున్న ఈ సంస్థ ప్రతినిధులు అభినందనీయం అని అన్నారు.దేశవ్యాప్తంగా 70 మందికి పైగా హస్త కళాకారులను ఒక చోటికి చేర్చి, వివిధ రకాల వస్తువులను ఇక్కడ ప్రదర్శించడానికి ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ లెస్ ట్రేడ్ సెంటరు- నరసాపురం వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు.అత్యధిక నాణ్యతతో కూడినటువంటి వస్తువులను ఈ సంస్థ ద్వారా విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని పొందడంతో పాటు,ప్రపంచ దేశాలలో భారత్ కు నమ్మకమైన సరఫదారుగా గుర్తింపు లభిస్తోందని తెలిపారు.స్థానికంగా ఉన్నటువంటి కళాకారులను తయారు చేసిన ఉత్పత్తులను ప్రమోటు చేయడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ” వోకల్ ఫర్ లోకల్ ” అనే నినాదాన్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా తీసుకు వచ్చారని తెలిపారు.తద్వారా ప్రజలు స్థానిక ఉత్పత్తులను కొనడం ద్వారా,హస్త కళాకారులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఇది మంచి శుభపరిణామం అన్నారు.కేంద్ర ప్రభుత్వం మీరు తయారు చేస్తున్నటువంటి వివిధ వస్తువులకి ” భౌగోళిక సూచిక ( GI Tag) ట్యాగ్ ” ఇవ్వడం ద్వారా తగిన గుర్తింపు నిస్తూ, జాతీయ & అంతర్జాతీయ వ్యాప్తంగా మీరు తయారు చేసిన వస్తువులకు డిమాండు కల్పించడానికి కృషి చేస్తోందని తెలిపారు.ఈ మధ్యకాలంలో స్థానిక హస్తకళాకారులు తయారు చేసినటువంటి వస్తువులకు దేశ వ్యాప్తంగా గిరాకీ కల్పించడంలో భాగంగా, కేంద్ర ప్రభుత్వం ” వన్ స్టేషన్ – వన్ ప్రోడక్ట్ ” అనే నినాదాన్ని తీసుకువచ్చిందని అన్నారు. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్లలో 15 వేలకు పైగా స్టాళ్లను ఏర్పాటు చేసి, హస్త కళాకారులు తయారు చేసినటువంటి వస్తువులు యొక్క అమ్మకాలు పెంచడానికి కృషి చేస్తోందని తెలిపారు. రైల్వే స్టేషన్ లోని ప్రయాణికులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు కావడంతో స్థానిక ఉత్పత్తులకు కూడా దేశవ్యాప్తంగా పబ్లిసిటీ లభిస్తోందిని తెలిపారు. ముఖ్యంగా మన నరసాపురం మరియు ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి సుమారు 80 వేల మందికి పైగా మహిళలు ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన లెసులను ( దిండు కవర్లు, క్యూస్షన్ కవర్లు, టేబుల్ రన్నర్లు, టేబుల్ క్లాత్ లు మొదలగునవి ) తయారు చేయడం మనకు గర్వకారణం అన్నారు.మీ ఉత్పత్తుల ద్వారా మన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది అందుకు మీ అందరిని అభినందిస్తున్నానని తెలిపారు.ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా ” వికసిత భారత్ – 2047 ” కలను సహకారం చేసేందుకు మహిళల యొక్క భాగస్వామ్యం అత్యంత ముఖ్యమైనదిగా భావించిందన్నారు. అందులో భాగంగా చట్టసభల్లో ” మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుందని,మీలో కూడా రాబోయే రోజుల్లో కొంతమంది ప్రజా ప్రతినిధులుగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు.మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రణాళికలను అమలుచేస్తోందని తెలిపారు. ఇక్కడ ఉన్న మహిళలంతా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటు వంటి ” ముద్ర లోన్స్ ” కూడా మీరు పొందవచ్చునని, అందుకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో మీరంతా కొత్త ఉత్పత్తులను,మరియు క్రొత్త డిజైన్లతో అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. తద్వారా మీరు తయారు చేసే లేసు ఉత్పత్తులకు ఒక బ్రాండు క్రియేటు చేసుకోవాలని, అందుకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ బరోసానిచ్చారు.
రాష్ట్ర జలవనరులు శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ కంప్యూటరు యుగంలో ఉన్నప్పటికీ మానవుని మేధస్సు, సృజనాత్మక శక్తితో తాయారు చేసిన హస్తకళలకు మంచి ప్రాధాన్యత,డిమాండు ఏ మాత్రం తగ్గలేదని రుజువు చేసిందన్నారు.ఉభయ గోదావరి జిల్లాల్లో హస్త కళలకు మంచి ప్రాధాన్యత ఉందని, రానున్న రోజుల్లో ఈ కళలకు మంచి ప్రాచుర్యం కల్పిస్తామని అన్నారు.నేను చిన్నప్పుడు ఏ ఇంటిలో చూసినా పనులు చేసుకుంటూ,కబుర్లు చెప్పుకుంటూ మహిళలు లేసు అల్లికలు చేసుకుంటూ ఉండేవారని అన్నారు. లేసు అల్లికలు,కలంకారి,ఏటి కొప్పాక బొమ్మలు, ఉప్పాడ, ధర్మవరం,కొండపల్లి బొమ్మలు, బొబ్బిలిలో వీణాలు తయారు ఇలా ఎన్నో హస్త కళలు ఉన్నాయని అన్నారు.ఏటి కొప్పాక బొమ్మలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది అంటే చేతివృత్తులకు ఎంత ప్రాచుర్యం ఉందో అర్థం అవుతుందని అన్నారు.కోట్లు పెట్టి భవనాలు కట్టుకున్నా లోన మనం చేతివృత్తులు ద్వారా చేసుకున్న వస్తువులు, బొమ్మలు తప్పకుండా అలంకరించు కుంటామని అన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేతివృత్తులు కళలకు,కళాకారులకు ఎన్నో అవకాశాలు కల్పిస్తుందని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హస్త కళలు క్వాలిటీ, క్రొత్త క్రొత్త డిజైన్లుతో తయారు చేస్తే మంచి డిమాండు, కళాకారులు మంచి ఆదాయం లభిస్తుందని అన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని, ప్రజా ప్రభుత్వం మరల గాడిలో పెట్టి పూర్వవైభవం తీసుకొస్తామని అన్నారు. పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు తరలివెళ్ళాయని మరల వాటిని తిరిగి తీసుకొస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం మరల రాదని హామీ ఇవ్వాలని వారు కోరుతున్నారని,రాష్ట్ర విభజన కంటే వారి ఐదేళ్ల పాలన నష్టం ఎక్కువ జరిగిందన్నారు. రానున్న కాలంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని, రాష్ట్రాన్ని అన్ని రంగాలలో పాటు హస్త కళలు, కళాకారులను మంచి ప్రోత్సాహం అందిస్తామని మంత్రి రామానాయుడు అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విఫ్,స్థానిక శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్,ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ,ఏపి కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు,ఆర్డీవో దాసిరాజు,ఈపిసిహెచ్ ఎక్స్ చైర్మన్ న్యూఢిల్లీ ఆర్.కె.పస్సి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు ఆర్.కె.వెర్మ,డిప్యూటీ డైరెక్టరు రాకేష్ వర్మ,గ్రామ సర్పంచి బందెల భారతి,అంతర్జాతీయ లేసు ట్రేడ్ సెంటరు ప్రతినిధులు కలవకొలను నాగ తులసీరావు, కలవకొలను తాతాజీ, లేసు ఉత్పత్తి దారులు,హస్తకళల ఉత్పత్తుల మహిళలు, లేసు ఎగుమతి దారులు, పట్టణ ప్రముఖులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.