గ్రామంలో అందే సత్యనారాయణ విగ్రహం ఆవిష్కరించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
అత్తిలి మండలం స్కిన్నెరపురం గ్రామ అభివృద్ధికి విశేష కృషి చేసిన జిల్లా పరిషత్ మాజీ వైస్ ఛైర్మన్ అందే సత్యనారాయణ భావితరాలు ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. అందే సత్యనారాయణ విగ్రహాన్ని అత్తిలి మండలం స్కిన్నెరపురం గ్రామంలో ఆదివారం ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ స్కిన్నెపురం గ్రామం నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన అందే సత్యనారాయణ గ్రామ అభివృద్ధితోపాటు ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా అందరినీ సమన్వయం చేసి ఈ ప్రాంత అభివృద్ధిలో తనదైన పాత్రను పోషించారని అన్నారు. అత్తిలి మండలంలోని పలు గ్రామాల అభివృద్థి« కోసం నిధులు తీసుకురావడానికి విశేష కృషి చేశారని కొనియాడారు. ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనడం చూస్తే ఈ ప్రాంతం అభివృద్ధిలో ఆయన ప్రభావం ఎంత మేర ఉందో అర్థమవుతోందన్నారు. Sఆయన ప్రజాప్రతినిధిగా ఉండటమే కాకుండా ఆయన భార్యను సర్పించిగా గెలిపించి గ్రామ అభివృద్ధికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి మూడు సార్లు పోటీ చేసిన సందర్భాల్లో అందే సత్యనారాయణ ఆశీస్సులు తీసుకున్నానని గుర్తు చేశారు. ఎప్పుడు కలిసినా కుటుంబ సభ్యుడిగా భావించి తన రాజకీయ జీవితంలో ఎంతో సహకారం అందించారని ఎమ్మెల్యే రాధాకృష్ణ చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధులుగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏపీఐఏఎస్సీ ఛైర్మన్ మంతెన రామరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.