వి.రిసార్ట్స్ పర్యాటకులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచుతుంది – పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

బాపట్ల జిల్లా పర్యటనకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ అవిడి గ్రామంలో వి.వాటర్స్ వాటర్ పార్క్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. ఇప్పటికే పీపీపీ విధానంలో పెట్టుబడులకు పలువురు ఇన్వెస్టర్లకు ఆహ్వానం పలికామన్నారు. అందులో భాగంగా నేడు వి రిసార్ట్స్ పేరుతో బాపట్లలో అధునాతనమైన రిసార్ట్స్ నిర్మించి, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వాటర్ స్పోర్ట్స్ ప్రవేశపెట్టి, భద్రతా ప్రమాణాలకు పెద్దపీట వేసి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నందుకు అధినేత సందీప్ ను మంత్రి దుర్గేష్ అభినందించారు. చాలా మంది రిసార్ట్స్ ఏర్పాటుకే పరిమతం అవుతారు కానీ ఇలాంటి యాక్టివిటీస్ ప్రవేశపెట్టడం అరుదు అన్నారు. ఒక రోజు కుటుంబం అంతా సంతోషంగా గడిపేలా వసతులు కల్పించడం బాగుందన్నారు. పీపీపీ విధానంలో వి.రిసార్ట్స్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. అద్భుతమైన ప్రకృతి రమణీయత కలిగిన బాపట్ల ప్రాంతంలో వి రిసార్ట్స్ ఏర్పాటు చేయడంతో మరింత శోభ చేకూరిందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వచ్చే పర్యాటకులు ఈ రిసార్ట్స్ ను వినియోగించుకోవాలని సూచించారు. బాపట్ల, చీరాల సమీపంలో ఏర్పాటు చేసిన వి రిసార్ట్స్ పర్యాటకులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచుతుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. వాటర్ స్పోర్ట్స్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో తనను భాగస్వామ్యం చేసినందుకు మంత్రి దుర్గేష్ సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే చీరాల-బాపట్ల మధ్య ఉన్న ప్రాంతాన్ని టూరిజం సర్క్యూట్ గా చేసేందుకు సన్నాహాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల శాసనసభ్యులు వేగేశ్న నరేంద్రవర్మ, చీరాల ఎమ్మెల్యే కొండయ్య, గౌడ కార్పొరేషన్ ఛైర్మన్ రాజశేఖర్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు స్వాములు, బాపట్ల సమన్వయ కర్త శ్రీమన్నారాయణ, వి రిసార్ట్స్ అధినేత సందీప్, భాస్కర్, కుటుంబీకులు, తదితరులు పాల్గొన్నారు..

Scroll to Top
Share via
Copy link