నోటికి వచ్చినట్లుమాట్లాడితే రాజకీయాలు చెల్లవు
మాజీ మంత్రి కారుమూరి జైలుకు వెళ్లడం ఖాయం
అన్నీ మూసుకుని కూర్చోవాలని వైసీపీ నేతలకు హితవు – కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ
తణుకులో విలేకరుల సమావేశంలో కూటమి నేతలు
ఎప్పుడో అధికారంలోకి వస్తామని పగటికలలు కంటున్న వైసీపీ నాయకులు కక్షసాధింపు కొనసాగిస్తామని చెబుతూ నరికేస్తాం, బయటకు ఈడ్చి తన్నుతామంటూ మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు మాట్లాడిన తీరును కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ దుయ్యబట్టారు. రాజకీయాల్లో పదజాలం, మనం ఉపయోగించే భాష చాలా ముఖ్యమని చెప్పారు. అడ్డమైన వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం, నోరు ఉంది కదాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే రాజకీయాలు చెల్లబోవన్నారు. గురువారం తణుకులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణతో కలిసి శ్రీనివాసవర్మ మాట్లాడారు. తమకు సంస్కారం ఉందని అందుకు అనుగుణంగానే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడటతాం తప్ప కొడాలి నాని, పేర్ని నాని, సీదిరి అప్పలరాజు, అనిల్‌కుమార్ యాదవ్ మాదిరిగా మాట్లాడబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే టీడీఆర్ కుంభకోణంలో పీకల్లోతు కూరుకుపోయిన మాజీ మంత్రి కారుమూరి ఎప్పుడు జైలుకెళ్తారో తెలియని పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున టీడీఆర్ అక్రమాలు జరిగిన మున్సిపాల్టీ తణుకు అని అన్నారు. గత అయిదేళ్ల కాలంలో కారుమూరి దౌర్జన్యాలు, ఫ్యాక్షనిజం, ఇబ్బందలు, దాడులు, అరెస్టులు తట్టుకుని నిలబడిన కార్యకర్తలు కూటమి కార్యకర్తలని చెప్పారు. మీరు వాడుతున్న భాష మేం వాడి, ప్రత్యక్ష చర్యలకు దిగితే సాయంత్రానికి జైలు కెళతారని అన్నారు. గౌరవప్రదమైన రాజకీయాలు చేయాలని హితవు పలికారు. రాష్ట్రంలో కనివినీ ఎరుగని రీతిలో వ్యరిరేకంగా ప్రజలు గౌరవ ప్రదమైన తీర్పు ఇచ్చారని ఈ పరిస్థితుల్లో అన్నీ మూసుకుని కూర్చుంటే మంచిదన్నారు. చేతకాని వ్యక్తులు మాత్రమే ఇలాంటి భాష, ప్రకటనలు చేస్తారని కారుమూరి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు. దమ్ము, ధైర్యంగా చ ఏసే రాజకీయాలు వేరుగా ఉంటాయని గతంలో తాము అధికారంలోకి ఉండగా ఇలాంటి రాజకీయాలు చేశామన్నారు. ఒకపక్క మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అసెంబ్లీకు రాకుండా ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతుంటే మరోవైపు మాజీ మంత్రి కారుమూరి బయటకు తిరగకుండా ఏదో కార్యకర్తల సమావేశంలో మాట్లాడితే చప్పట్లు కొడతారని ఇదే రాజకీయం అనుకుని నోటికి వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు సహించబోరని హెచ్చరించారు. ముఖ్యంత్రి చంద్రబాబునాయుడు తనకున్న విజన్‌తో రాజధాని అమరావతిని త్వరితగతిన అభివృద్ధి చేయాలనే తపనతో పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయాలని, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకురావాలని, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంతో పని చేస్తున్నారని చెప్పారు. ఈ నెలలో అమరావతికి దేశ ప్రధాని నరేంద్రమోదీను తీసుకువచ్చి పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టేలా ప్రణాళికలు చేస్తున్నారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తనకున్న పరిచయాలతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలతో పోల్చితే తణుకు నియోజకవర్గానికి ఎక్కువ నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే రూ. 3.50 కోట్లుతో చేసిన ప్రతిపాదనలకు సీఎస్ఆర్ నిధులు మంజూరు చేయగా మరో రూ. 3.50 కోట్లకు సంబంధించి ప్రతిపాదనలు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీదేవి, మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ, తణుకు ఏఎంసీ ఛైర్మన్ కొండేటి శివ, కూటమి నాయకులు పాల్గొన్నారు.