ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చుకున్న చంద్రబాబు
వేట నిషేధ సమయంలో రూ. 20 వేలు సాయం విడుదల
1,29,178 మత్స్యకార కుటుంబాలకు రూ.259 కోట్ల లబ్ధి
మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్థికసాయంను రెట్టింపు చేసి ఇచ్చిన హామీను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చెప్పారు. ఇందుకు సంబంధించి నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విడుదల చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 1,29,178 మత్స్యకార కుటుంబాలకు రూ. 259 కోట్ల లబ్థి చేకూరిందన్నారు. మత్స్యకార గ్రామాలకు టీడీపీకి అండగా నిలబడితే ఆయా గ్రామాలు సైతం తెలుగుదేశం పార్టీకు అండగా నిలబడ్డాయని అన్నారు. వెనుకబడిన వర్గాల సంక్షేమం తెలుగుదేశం ధ్యేయమన్నారు. సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఇబ్బందులు పడకుండా ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఆర్ధిక సాయాన్ని రూ.10 వేలు నుంచి రూ.20 వేలకు పెంచామన్నారు. ప్రజలందరికీ సంక్షేమం అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. గత పాలకులు ఫిష్ ఆంధ్ర పేరుతో రూ. 300 కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఒక్క మత్స్యకారుని కుటుంబమైనా బాగుపడలేదన్నారు. 2014లో తొలిసారిగా తెలుగుదేశం ప్రభుత్వమే వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు భృతిని ప్రవేశ పెట్టిందని, 2014–2019 మధ్య మత్స్యకారుల సంక్షేమం కోసం రూ.788 కోట్లు తమ ప్రభుత్వం ఖర్చు పెట్టిందని, అంతేకాకుండా వలలు, పడవలు, ఐస్ బాక్సులు అదనంగా ఇచ్చిందన్నారు.
రాష్ట్రంలో 68,396 మంది మత్స్యకారులకు నెలనెలా పింఛన్లు ప్రభుత్వం అందిస్తోందన్నారు. మత్స్యకారులు చేపల వేట సమయంలో మరణిస్తే రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియో ప్రభుత్వం చెల్లిస్తోందని, వేటకు వెళ్లే బోట్లకు లీటర్ డీజిల్‌పై రూ.9 సబ్సిడీ ఇస్తోందన్నారు. చేపల ఎగుమతుల్లో ఏపీ టాప్ రాష్ట్రంలో 555 మత్స్యకార గ్రామాలున్నాయని, చేపల ఎగుమతుల్లో మన రాష్ట్రం ముందువరుసలో ఉందన్నారు. దేశంలో ఉత్పత్తి అయ్యే మత్స్యసంపదలో 29 శాతం మన రాష్ట్రం నుంచే ఉంటోందన్నారు. ఏపీ నుంచే 32 శాతం మత్స్య సంపద ఎగుమతులు జరుగుతున్నాయని, మత్స్య ఉత్పత్తుల ద్వారా 16.50 లక్షల మందికి ఉపాధి లభిస్తోందని చెప్పారు. చేపల పెంపకం వల్ల ఎన్నో లాభాలున్నాయని వీటి ద్వారా ప్రోటీన్ అధికంగా శరీరానికి అందుతుందని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే చేపలు వినియోగం పెరగాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ చెప్పారు.