సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణం వెనక్కి తీసుకోవాలని సిపిఎం వేల్పూరు గ్రామ కమిటీ డిమాండ్ చేసింది. భూస్వాములకు కొమ్ము కాస్తూ పేదల ఇళ్లను అన్యాయంగా కూల్చి వేయడంపై సిపిఎం వేల్పూరు గ్రామకమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఫోటో కాపీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం వేల్పూరు గ్రామ కార్యదర్శి బళ్ళ చినవీరభద్రరావు మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకుని నివాసముంటున్న పేదలకు ఇళ్ల పట్టాలిస్తామని వాగ్దానం చేసిన నాయకులు దానికి విరుద్ధంగా గత నాలుగు ఐదు దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మించుకుని నివాసముంటున్న పేదల ఇల్లును ఇప్పుడు అన్యాయంగా కూల్చి వేయడం సరికాదని వీరభద్రరావు విమర్శించారు. ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు భూస్వాములకు ఊడిగం చేస్తూ నిరుపేదలకు చెందిన దాదాపు 1000 కుటుంబాల ఇళ్లను కూల్చివేసి బిజెపికి మించిన బుల్డోజర్ పాలన సంస్కృతి మన జిల్లాలో అమలు చేస్తూ పేద కుటుంబాలను రోడ్డుపాలు చేశారని దీనికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం స్పందించి తక్షణం సమాధానం చెప్పాలని కూల్చివేసిన ఇళ్ల బాధితులకు ప్రత్యమయంగా ప్రభుత్వమే ఉచితంగా ఇల్లు నిర్మించి ఇవ్వాలని వీరభద్రరావు డిమాండ్ చేశారు. లేకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శాఖ కార్యదర్శి వాసా వెంకటేశ్వరావు. యండమూరి నాగేంద్ర. వాసా పోసియ్య. లంకె నారాయణ. తాళ్ళ సత్యనారాయణ. అందే కోట బసవయ్య. లంకె దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
