ఆపరేషన్ సింధూర్ సైనికులకు మద్దతుగా నిడదవోలులో తిరంగా ర్యాలీ

వివరాలు వెల్లడించిన మంత్రి కందుల దుర్గేష్

ఆదివారం సాయంత్రం 4 గం.లకు గాంధీ విగ్రహం నుండి గణపతి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహణ

ప్రతి ఒక్కరూ తిరంగా ర్యాలీలో పాల్గొనాలని, తద్వారా అందరం భారతీయులమేనని నినదిద్దామని పిలుపునిచ్చిన మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు: ఆపరేషన్ సింధూర్,సైనికులకు మద్దతుగా రేపు నిడదవోలులో తిరంగా ర్యాలీ నిర్వహించనున్నామని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. శనివారం నిడదవోలు మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు. ఆపరేషన్ సిందూర్ విజయోత్సవం సందర్భంగా దేశం కోసం సైన్యం – సైన్యం కోసం మనం అంటూ 18 ఆదివారం సాయంత్రం 4 గం.లకు నిడదవోలు పట్టణంలోని గాంధీ విగ్రహం నుండి గణేష్ చౌక్ మీదుగా గణపతి సెంటర్ వరకు తిరంగా ర్యాలీని నిర్వహిస్తామని వివరాలు వెల్లడించారు. తద్వారా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న సైనికులకు స్థైర్యాన్ని, ధైర్యాన్ని అందిద్దామని తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పహల్గాంలో ఉగ్రవాదుల దాడి అత్యంత దుర్మార్గమన్నారు. ఈ నేపథ్యంలో పహల్గామ్ లో ఉగ్రమూకల దాడిని ఖండించి భారతీయుల ఐక్యతను ప్రదర్శించామన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆపరేషన్ సింధూర్‌తో ఉగ్రస్థావరాలపై దాడి జరిపి భారతదేశ ప్రతిష్టను నెలబెట్టారని తెలిపారు. ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొన్న సైన్యానికి హాట్సాఫ్ తెలిపారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న మతాలు ఉన్నప్పటికీ మనమంతా భారతీయులమేనని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ క్రమంలో తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నామని తెలిపారు. జాతీయ జెండాను చూడగానే ప్రతి ఒక్కరిలో దేశభక్తి, ఉద్వేగం ఉప్పొంగుతాయని అందుకే మువ్వన్నెల జెండాను పట్టుకొని తామంతా భారతీయులమనే నినాదాన్ని ప్రతిధ్వనించేలా నినదించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో తనతో పాటు మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ, మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు,పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు వెంకటేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేశ్, బీజేపీ పట్టణ అధ్యక్షులు ప్రమోద్ కుమార్, స్వచ్ఛంధ సంస్థలు తదితరులు పాల్గొంటారని తెలిపారు.

Scroll to Top
Share via
Copy link