11 నెలల్లో నిడదవోలులో రూ.105.80 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు
మున్సిపాలిటీ సాధారణ నిధుల నుండి రూ.15.75 కోట్లతో 240 అభివృద్ధి పనులు
జూన్ 1 వ తేదీ నుండి గుడ్ మార్నింగ్ నిడదవోలు కార్యక్రమంతో అపరిష్కృత సమస్యలకు చెక్
‘నిడదవోలు’ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
నయా నిడదవోలుకు బాటలు వేసేందుకు చర్యలు తీసుకుంటామన్న మంత్రి కందుల దుర్గేష్
గ్రీన్ కార్పొరేషన్ ద్వారా పట్టణ సుందరీకరణకు చర్యలు
నిడదవోలు పట్టణంలో 250 సీసీ కెమెరాల ఏర్పాటు తద్వారా నేరాలకు అడ్డుకట్ట
వ్యర్థ రహిత పట్టణంగా నిడదవోలు
ఆర్ఓబీ పూర్తికి ప్రత్యేక శ్రద్ధ
నిడదవోలు మున్సిపాలిటీ టీంకు మంత్రి దుర్గేష్ అభినందన
మున్సిపల్ అధికారులతో జరిగిన సమావేశంలో పట్టణాభివృద్ధికి కీలక నిర్ణయాలు
నిడదవోలు: రాష్ట్రంలో నిడదవోలు పట్టణాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో నిలిపేందుకు కృషి చేసి అందమైన నిడదవోలుకు బాటలు వేస్తానని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ పేర్కొ న్నారు. శనివారం నిడదవోలు మున్సిపాలిటీ అధికారులతో సమావేశం నిర్వహించి పట్టణ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. త్వరలోనే నిడదవోలు పట్టణాన్ని సుందరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన పనులు చేపడతామని మంత్రి దుర్గేష్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం 11 నెలల కాలంలో నిడదవోలు పట్టణంలో రూ.105.80 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని వివరాలు వెల్లడించారు. మున్సిపాలిటీ సాధారణ నిధుల నుండి రూ.15.75 కోట్ల అంచనా వ్యయంతో 240 అభివృద్ధి పనులకు ప్రత్యేకంగా ఖర్చు చేస్తున్నామన్నారు. రూ.8.12 కోట్లతో ఇప్పటికే 187 పనులు పూర్తి అయ్యాయని స్పష్టం చేశారు. మిగిలిన నిధులతో మిగిలిన అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు.ఇది పేరుకే ఐ లవ్ నిడదవోలు కాదు అందమైన నిడదవోలుకు బాటలు వేస్తామన్నారు. అభివృద్ధిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలు సమాన నిష్పత్తిలో ముందుకు తీసుకెళ్లాలన్నదే తమ ధ్యేయమన్నారు.
త్వరలోనే గుడ్ మార్నింగ్ నిడదవోలు కార్యక్రమానికి శ్రీకారం: మంత్రి దుర్గేష్
త్వరలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తుందని మంత్రి దుర్గేష్ గుర్తుచేశారు. ఈ సందర్భంగా జూన్ 1వ తేదీ నుండి ప్రతి వారంలో ఒకరోజు పట్టణంలో గుడ్ మార్నింగ్ నిడదవోలు కార్యక్రమాన్ని చేపట్టి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో తనతో పాటు మున్సిపల్ ఛైర్మన్, మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, కూటమి నాయకులు పాల్గొంటారని తెలిపారు.
నిడదవోలు అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ.. ఇప్పటికే రూ.రూ.105.80 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు: మంత్రి దుర్గేష్
నిడదవోలు పట్టణ అభివృద్ధికి 11 నెలల కాలంలో రూ. 105.80 కోట్ల నిధులు వెచ్చించామన్నారు. తద్వారా నిడదవోలుకు గోదావరి జలాలు, ఆర్వోబీ పనులు, ఆస్పత్రి ఆధునికీకరణ తదితర పనులకు ఖర్చు చేస్తున్నామన్నారు. 15వ ఆర్థిక సంఘం నుండి రూ.4.50 కోట్లను తీసుకువచ్చామని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఆ నిధులతో వ్యర్థాల నిర్వహణ, త్రాగునీటి సరఫరా, డ్రెయిన్స్ శుభ్రతకు వినియోగిస్తున్నామన్నారు. రాజమండ్రి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ద్వారా ప్రత్యేకించి రుడా ఛైర్మన్, వైస్ ఛైర్మన్ తో మాట్లాడి పట్టణానికి రూ. కోటి రూపాయల నిధులు మంజూరు చేయించానన్నారు.ఆ నిధులతో రామదాసు స్ట్రీట్ నుండి యూ షాపింగ్ కాంప్లెక్స్, మార్కెట్ యార్డు వరకు రోడ్డు వేసేందుకు వినియోగిస్తామన్నారు. నిడదవోలుకు గోదావరి జలాలు తీసుకొస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వాటర్ గ్రిడ్ ద్వారా రూ.83.82 కోట్ల నిధులతో అమృత్ పథకం -2 ద్వారా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాబోయే రోజుల్లో పట్టణంలో అందరికీ నీళ్లు అందిస్తామన్నారు. ఎన్టీఆర్ నగర్ కు రూ.5.96 కోట్లతో త్రాగునీరు సరఫరా చేస్తామన్నారు. ఏపీ టిడ్కో ఇళ్లకు త్రాగునీరు అందించేందుకు రూ.82 లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు.గత ప్రభుత్వం అమృత్, జలజీవన్ మిషన్ నిధులను దారి మళ్లించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మున్సిపాలిటీ బీపీఎస్ కు, ఎల్ఆర్ఎస్ ఫండ్స్ క్రింద రూ.33 లక్షలు వచ్చాయన్నారు. ఆ నిధులతో మురుగుకు చెక్ పెడతామన్నారు. వైఎస్సార్ కాలనీలో అర్బన్ హెల్త్ సెంటర్ ను రూ.35 లక్షలతో పూర్తి చేశామని, పెండింగ్ వర్క్ లను త్వరలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే మరో రూ.3 కోట్లను తీసుకువచ్చి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఖర్చు చేస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ. కోటి విడుదలైనట్లు తెలిపారు. మిగిలిన రూ.2 కోట్ల విడుదల విషయంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో చర్చించానని, త్వరలోనే ఆ నిధులు సమకూరుతాయన్నారు.
నిడదవోలులో బ్యూటిఫికేషన్ కు చర్యలు: మంత్రి దుర్గేష్
నిడదవోలు పట్టణాన్ని మరింత అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్న సదుద్దేశంతో గ్రీన్ కార్పొరేషన్ సహకారంతో నిడదవోలు పట్టణ సుందరీకరణ కార్యక్రమం చేపట్టనున్నామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. తద్వారా పచ్చదనం, పారిశుధ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నగర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపడనున్నాయని తెలిపారు.
త్వరలో నిడదవోలు పట్టణంలో 250 నిఘానేత్రాల ఏర్పాటుకు చర్యలు: మంత్రి కందుల దుర్గేష్
ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, చట్టవ్యతిరేక కార్యకపాలకు అడ్డుకట్ట వేసేందుకు నిడదవోలు పట్టణ వ్యాప్తంగా దాదాపు 250 సీసీ కెమెరాలు అవసరమవుతాయని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయమై ఓఎన్జీసీ, గెయిల్ తదితర కార్పొరేట్ సంస్థలతో చర్చించామని, త్వరలో సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) ఫండ్స్ ద్వారా సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. వాస్తవానికి సీసీ కెమెరాల ఏర్పాటు సీఎస్ఆర్ పరిధిలోని అంశం కానప్పటికీ తాను ప్రత్యేకంగా నిధులు కోరడంతో వారు ఆమోదం తెలిపారని మంత్రి వెల్లడించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతతో సీసీ కెమోరాలు అందుబాటులోని వస్తున్నట్లు తెలిపారు.పట్టణంలో నేరాలను నియంత్రించేందుకు, అసాంఘికకార్యకలాపాలు జరగకుండా ప్రశాంతమైన వాతవరణం కల్పించడంలో సీసీ కెమెరాలు ఉపయోగపడుతాయని తెలిపారు.
వ్యర్థ రహిత పట్టణంగా నిడదవోలు: మంత్రి దుర్గేష్
డంపింగ్ యార్డు కొరత, ఘన వ్యర్థాల నిర్వహణ సమస్య వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని భావించి ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లకుండా నిడదవోలు పట్టణాన్ని పరిశుభ్రంగా, వ్యర్థ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టనున్నామని మంత్రి దుర్గేష్ అన్నారు. ప్రజలకు వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పిస్తామన్నారు. వ్యర్థాలను సేకరించి తరలించడం మరియు శుభ్రపరిచే వ్యవస్థను త్వరలో అందుబాటులోకి తీసుకువచ్చి వ్యర్థ రహిత నగరంగా మారుస్తామన్నారు.శుభ్రత, సమర్థమైన వ్యర్థాల నిర్వహణే సుపరిపాలనకు మార్గమని కూటమి ప్రభుత్వం విశ్వసిస్తుందన్నారు
నిడదవోలు పట్టణంలో సుందరమైన మార్కెడ్ యార్డు ఏర్పాటుకు చర్యలు: మంత్రి దుర్గేష్
నిడదవోలు పట్టణంలో తొలి దశలో రూ. 2.50 కోట్ల ఖర్చుతో భవిష్యత్ లో సుందరమైన మార్కెట్ యార్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.
ప్రకృతి వైపరీత్యాల ద్వారా వచ్చే మురుగునీరుకు చెక్: మంత్రి దుర్గేష్
భారీ వర్షాలు, విపత్తులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో వచ్చే నీరును డ్రైనేజీ ద్వారా బయటకు పంపేందుకు చర్యలు చేపడతామని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ అంశంపై పూర్తిస్థాయిలో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిన అనంతరం చర్యలకు అధికారులను ఆదేశించానన్నారు.
ఆర్ఓబీ పూర్తికి ప్రత్యేక శ్రద్ధ: మంత్రి దుర్గేష్
నిడదవోలు పట్టణంలో ఆర్ఓబీ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి దుర్గేష్ అన్నారు. త్వరితగతిన ఆర్ఓబీ పూర్తికి చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించామని తెలిపారు.
టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వకుండా గత ప్రభుత్వం తాత్సారం: మంత్రి దుర్గేష్
గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించకుండా తాత్సారం చేసిందని మండిపడ్డారు.ఈ క్రమంలో టిడ్కో లబ్ధిదారుల ఇబ్బందులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లామన్నారు. నిడదవోలు పట్టణంలో రెండో దశలోని టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని హామీ ఇచ్చారు.
పూర్తిస్థాయిలో మాల్గుడి చెరువు అభివృద్ధి: మంత్రి దుర్గేష్
రూ 4.53 కోట్లతో మాల్గుడి చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి దుర్గేష్ తెలిపారు. గ్రీనింగ్ కార్పొరేషన్ సహకారంతో చెరువులో పూడిక తీయించి సుందరీకరణ చర్యలు చేపడతామన్నారు.
మార్కెట్ షెడ్ల ఆధునికీకరణ: మంత్రి దుర్గేష్
మెప్మా వెండర్స్ కు సంబంధించిన మార్కెటింగ్ కోసం రూ.40 లక్షలు మంజూరు అయ్యాయని మంత్రి దుర్గేష్ తెలిపారు. రూ.1.50 కోట్ల నిధులకు మళ్లీ ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. ప్రస్తుతం సౌకర్యాల కొరతతో సమస్యగా మారిన మార్కెట్ షెడ్లను దాదాపు రూ.2 కోట్లతో ఆధునికీకరిస్తామన్నారు.
రూ.3 కోట్లతో పర్యాటక కేంద్రంగా నిడదవోలు: మంత్రి దుర్గేష్
అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా రాజమండ్రి పరిసర ప్రాంతాలతో పాటు ప్రత్యేకంగా రూ.3 కోట్లతో నిడదవోలును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని మంత్రి దుర్గేష్ తెలిపారు. తాను ప్రత్యేకంగా చొరవ తీసుకొని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో మాట్లాడి రాజమహేంద్రవరానికి ప్రాజెక్టును తీసుకువచ్చానన్నారు.ఇప్పటికే టెండర్లు పిలిచామన్నారు. ఒక టెండర్ ఓకే అయిందని తెలిపారు. పుష్కరాలలోపే కాలువలో బోటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. కెనాల్ సమీపంలో పర్యాటకులు సేద తీరేలా కెప్టేరియాను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రాజెక్టులో భాగంగా ప్రసిద్ధి పొందిన స్థానిక కోట సత్తెమ్మ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
త్వరలోనే నిడదవోలుకు క్రీడా మైదానం: మంత్రి దుర్గేష్
క్రీడలకు ప్రాధాన్యమిస్తూ, క్రీడాకారులకు అండగా ఉంటామని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ క్రమంలో నిడదవోలులో క్రీడా మైదానం ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే క్రీడా మైదానం మంజూరు అవుతుందని సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే సంబంధిత డాక్యుమెంట్లు పొందుపరిచానన్నారు.
నిడదవోలులోని 30 పడకల ఆస్పత్రి 100 పడకల ఆస్పత్రిగా ఆధునికీకరణ: మంత్రి దుర్గేష్
ఆస్పత్రి అంటే కేవలం నిర్మాణం మాత్రమే కాదని అవసరమైన వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, వారికి జీతాలు, పరికరాలు, ఇతర మౌలిక వసతులు అవసరమవుతాయని మంత్రి దుర్గేష్ వివరించారు. ఇప్పటికే ఈ విషయమై ప్రభుత్వంతో చర్చించనట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం కంటితుడుపు చర్యగా ఆస్పత్రిలో పడకల సంఖ్యను పెంచాతామని పేర్కొందని మంత్రి అన్నారు. నిడదవోలు, నందిగామ, ధర్మవరం ప్రాంతాల్లో తొలుత 100 పడకల ఆస్పత్రి ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. త్వరలోనే ఆస్పత్రి పనులు మొదలుపెట్టి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
విద్యాజ్యోతి కళాశాల దగ్గర ఎంపీ ల్యాడ్స్ నిధుల ద్వారా వచ్చిన రూ. 25 లక్షలను డ్రింకింగ్ వాటర్ యూనిట్ కోసం వినియోగిస్తున్నామన్నారు. ఇవే గాక దేవాదాయ శాఖతో చర్చించి గోలింగేశ్వర స్వామి ఆలయంలో షెడ్డు నిర్మాణం చేపడతామన్నారు. మసీదులు, మదర్సాలు, షాదీఖానాలను అభివృద్ధి చేస్తామన్నారు. సమగ్ర పట్టణంగా నిడదవోలును అభివృద్ధి చేసి తీరుతామన్నారు.
ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధిపై అవగాహన ఉండి ఆ దిశగా ముందుకు నడిపిస్తున్న నిడదవోలు మున్సిపాలిటీ బృందాన్ని ప్రశంసించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా తాను నిడదవోలు పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు సహకరించాలన్న సదుద్దేశంతో మున్సిపల్ ఛైర్మన్ మొదలుకొని కౌన్సిలర్ల వరకు అభివృద్ధిపై సంపూర్ణ ఆకర్షణ ఉన్నవారే కూటమిలో చేరారని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.రాబోయే రోజుల్లో నిడదవోలు ముఖచిత్రం మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ, కమిషనర్ టి. కృష్ణవేణి, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.