మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనం
జగన్‌మోహన్‌రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం
ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం
మరో 15 ఏళ్లు అధికారంలోకి ఉంటుందని వెల్లడి
‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ
గత అయిదేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని జగన్‌మోహన్‌రెడ్డి బ్రష్టు పట్టించారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ధ్వజమెత్తారు. మరోసారి జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్ర సర్వనాశనం అవుతుందని అన్నారు. తణుకు మండలం దువ్వ గ్రామంలో ఆదివారం నిర్వహించిన అన్నదాత సుఖీభవ పథకంలో రైతులకు చెక్కులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. మద్యం కుంభకోణంలో త్వరలోనే జగన్‌మోహన్‌రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. ఎన్నికలకు ముందుకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడిన ప్రభుత్వంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని అమలు చేస్తూ మరోపక్క అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేవిధంగా రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని ఏడాది లోపే అమలు చేసి రూ. 20 వేలు మూడు విడతల్లో అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 43 లక్షల మంది రైతులకు రూ. 2300 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసిందన్నారు. ఇకపై ప్రతి ఏడాది రూ. 20 వేలు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని చెప్పారు. తణుకు నియోజకవర్గంలో దాదాపు 16 వేల మంది రైతులకు రూ. 11. 46 కోట్లు అందజేశామన్నారు. రైతుల పక్షాన కూటమి ప్రభుత్వం నిలబడుతుందని మరోసారి రుజువు చేసినట్లు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నెలల తరబడి ధన్యాం డబ్బులు రాకపోవడంతో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి చేసి మద్యం కుంభకోణంలో వేలాది కోట్లు పక్కదోవ పట్టించారని ఆరోపించారు. మద్యం కుంభకోణంలో ఇప్పటికే ఒకొక్కరు జైలుకు వెళుతుండగా త్వరలోనే జగన్ సైతం జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఆనాడు పెట్టుబడులు పెట్టేందుకువచ్చిన పారిశ్రామికవేత్తలను రాష్ట్రం నుంచి తరిమేశారని ఆరోపించారు. పోలవరం, అమరావతి నిర్మాణాలను బ్రష్టు పట్టించారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చంద్రబాబునాయుడు 2018 వరకు 70 శాతం పూర్తి చేస్తే వైసాపీ హయాంలో నాయకులు 5 శాతం మాత్రమే పూర్తి చేశారని అన్నారు. సంక్షేమంతోపాటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రూ. 200 కోట్లుతో నియోజకవర్గంలో తాగునీరు అందించేందుకు ప్రణాళకలు సిద్ధం చేసినట్లు చెప్పారు. గతంలో ఇళ్లస్థలాలు రానివారికి ఇళ్ల స్థలాలు అందించేందుకు చర్యలు తీసకుంటున్నామన్నారు. భవిష్యత్తు తరాలు బాగుండాలంటే మరో 15 ఏళ్లు ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సైతం చెబుతున్నారని చెప్పారు. ఒరిసా, గుజరాత్ రాష్ట్రాలు సుస్థిరమైన పాలన కారణంగానే అభివృద్ధి జరుగుతోందని గుర్తించాలన్నారు. కూటమి ప్రభుత్వాన్ని మరో 15 ఏళ్లు అధికారంలో ఉండే విధంగా ప్రజలు కృషి చేయాలి. దువ్వ వయ్యేరు కారణంగా రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇందుకు శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.