సాధారణ తనిఖీలలో భాగంగా ఐజి అశోక్ కుమార్ శనివారం ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటి, గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రశాంతతకు మారుపేరైన తూర్పుగోదావరి జిల్లాలో శనివారం పలు పోలీస్ స్టేషన్లను సందర్శించడం జరిగిందని అందులో భాగంగా ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్ కి రావడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖలో తగిన సిబ్బంది లేకపోవడంతో ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులపై ఒత్తిడి అధికంగా ఉంటుంది, ఈ విషయంలో సిబ్బంది నియామకాలపై కాకుండా సాంకేతికతను ఉపయోగించి కేసుల పరిష్కారం పై ఎక్కువగా దృష్టి పెడుతున్నామని, సీసీ కెమెరా, కాల్స్ నెట్వర్క్ లొకేషన్ ట్రేసింగ్, చర్యలతో నేరస్థులను త్వరితంగా అరెస్టు చేస్తున్నామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 5000 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని, ఆరు జిల్లాల పరిధిలో సీసీ కెమెరాలు ద్వారానే ఎన్నో క్లిష్టతరమైన చోరీ కేసులలో కూడా 24 గంటల వ్యవధిలోని రికవరీ చేయడం జరుగుతుందని అన్నారు. సైబర్ నేరాలలో ఎక్కువగా సీనియర్ సిటిజన్స్, రిటైర్డ్ ఎంప్లాయిస్ వంటి వారిని టార్గెట్ చేస్తున్నారని అందువల్ల వారిలో అవగాహన కల్పించడానికి పోలీసు శాఖ నిరంతరం ప్రచార మాధ్యమాల ద్వారా సోషల్ మీడియాలో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఇటీవల నిడదవోలు పట్టణంలో ఫోక్సో కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి వలి భాష అనే వ్యక్తిని ఇంటి వద్ద ఘోరంగా నరికి చంపిన ఘటన ప్రస్తావించగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలలో బెయిల్ పై బయటకు వచ్చిన ముద్దాయిలపై నిఘా పెట్టడం, పరిస్థితులను బట్టి వారిపై రౌడీషీట్లను ఓపెన్ చేయటం జరుగుతుందని, ప్రత్యేకంగా ఇటువంటి కేసులలో బాధితులు నిందితులు నుండి వేదింపులు ఎదురైనట్లయితే పోలీసు అధికారులతో సంప్రదించినచో వారికి న్యాయం జరుగుతుందని అన్నారు. ఫోక్సో కేసులలో ముద్దాయిల సమాచారాన్ని కంప్యూటరీకరణ చేస్తున్నామని అన్నారు.
ఇటీవల మహిళల రక్షణ కొరకు శక్తి యాప్ ను ప్రవేశపెట్టడం జరిగింది దాని ద్వారా మీరు కంప్లైంటు చేయవచ్చు పోలీస్ స్టేషన్కు రానవసరం లేకుండా మీకు పోలీసు అధికారులే ఫోన్ చేసి మీ సమస్యను పరిష్కరిస్తారు. ఈమెయిల్ ద్వారా వెబ్సైట్ ద్వారా కూడా కంప్లైంట్ ను లాగిన్ చేయవచ్చని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా కాలేజీలకు, పాఠశాలలకు వెళ్ళి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, అదేవిధంగా ప్రతి సోమవారం జిల్లా కార్యాలయంలో పి.జి.ఆర్.ఎస్ ప్రోగ్రాం ద్వారా ప్రజలకు ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలను తెలియజేసుకునే అవకాశం ఉందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, కొవ్వూరు డిఎస్పి దేవకుమార్, నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.వి.జి. తిలక్, ఉండ్రాజవరం ఎస్సై జి.శ్రీనివాస్, ఏఎస్ఐ. కే.రామకృష్ణ పాల్గొన్నారు.