నిడదవోలు నియోజవర్గంలో 11.60 కి.మీల 4 రోడ్ల పనులకు రూ.7.37 కోట్ల నాబార్డు నిధులు మంజూరు
రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్న మంత్రి కందుల దుర్గేష్
రహదారులు అభివృద్ధికి చిహ్నాలు అని పేర్కొన్న మంత్రి దుర్గేష్
నియోజకవర్గ ప్రజల తరపున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి దుర్గేష్
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి, శాసనసభ్యులు కందుల దుర్గేష్ చొరవతో నిడదవోలు నియోజకవర్గంలో 11.60 కి.మీల 4 రోడ్ల పనులకు రూ.7.37 కోట్ల నాబార్డు నిధులు మంజూరు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఉండ్రాజవరం మండలంలోని పైడిమర్ర – సత్యవాడ, పెరవలి మండలంలోని కానూరు – నడుపల్లి కోట, కాపవరం – కొత్తపల్లి అగ్రహారం, నిడదవోలు మండలంలోని సింగవరం – నందమూరులో రాకపోకలకు ఇబ్బంది లేకుండా రహదారుల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఏడు నియోజక వర్గాల పరిధిలో రహదారుల అభివృద్ధి నిమిత్తం నాబార్డు ద్వారా 38.61 కిలో మీటర్ల మేర 13 రహదారుల నిర్మాణం, మరమ్మత్తులు చేపట్టేందుకు రూ.24.62 కోట్ల అంచనాతో నిధులు మంజూరు కాగా కేవలం నిడదవోలు నియోజకవర్గంలో 4 రోడ్లకు ఈ మేర నిధులు రావడంలో మంత్రి దుర్గేష్ తీవ్రంగా కృషి చేశారు.ఆయా రహదారుల దుస్థితిని గమనించిన మంత్రి దుర్గేష్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి తద్వారా రోడ్డు పనులకు నిధులు విడుదల చేయించడంలో తనదైన మార్క్ చూపారు. నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న రహదారులను బాగుచేసే దిశగా కృషి చేస్తున్నారు. నాబార్డు నిధులు మంజూరు అయిన వెంటనే విషయాన్ని ప్రజలకు తెలుపుతూ రహదారులు అభివృద్ధికి చిహ్నాలు అని మంత్రి దుర్గేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల తరపున ప్రభుత్వానికి మంత్రి దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు.