రాబోయే 30 ఏళ్లలో అవసరాలు తీర్చే విధంగా ప్రణాళికలు
పట్టణీకరణలో భాగంగా భాగంగా జనాభా పెరిగే అవకాశాలు
వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
తణుకు మున్సిపల్ మాస్టర్ ప్లాన్ తయారీపై సమీక్ష
భవిష్యత్తు తరాలకు, అవసరాలకు ఉపయోగపడే విధంగా మాస్టర్ ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఉందని ఇందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. తణుకు పురపాలక సంఘానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ తయారీలో భాగంగా గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. మున్సిపల్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 1984లో అప్పటి తొలి మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ మాస్టర్ ప్లాన్ తయారుచేసి భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడే విధంగా 1990లో మాస్టర్ ప్లాన్ అమలు చేశారని గుర్తు చేశారు. దాని ప్రకారమే తణుకు పట్టణంలో జోన్లు వారీగా అనుమతులు వస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం 24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం నుంచి భవిష్యత్తులో 85 చదరపు కిలోమీటర్ల వేస్తీర్ణం ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. దీని ప్రకారం తణుకుతో పాటు తణుకు పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందేలా బాస్టర్ ప్లాన్ రూపకల్పనకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రస్తుత జనాభా ప్రకారం పట్టణాల్లో 35 శాతం ప్రజలు నివాసం ఉంటున్నారని మిగిలిన 65 శాతం గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారని చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా 2047 నాటికి 50 నుంచి 60 శాతం జనాభా పట్టణాల్లో నివసించే విధంగా మాస్టర్ ప్లాన్ ఉంటుందని అన్నారు. మాస్టర్ ప్లాన్ అమరలో భాగంగా తణుకు పురపాలక సంఘంలో విలీనం అయ్యే 11 గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. ముఖ్యంగా భవిష్యత్తు అవసరాల కోసం రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ టవర్లు, పార్కులు, పాఠశాలలు నిర్మాణంతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ లో పొందుపరచాలని కోరారు. ప్రస్తుతం ఉన్న మాస్టర్ ప్లాన్ అవసరమైతే మార్పులు చేర్పులు చేసే విధంగా ప్రతిపాదనలు చేయాలని సూచించారు. ప్రస్తుతం పెరుగుతున్న ట్రాఫిక్ అనుగుణంగా రాష్ట్రపతి వద్దకు అనుసంధానంగా రోడ్లు నిర్మాణాలు చేయాల్సిన అవసరం ఉందని రాధాకృష్ణ చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులతో పాటు వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.