సేవా కార్యక్రమాలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి కృష్ణతులసి
సంస్థ సేవా కార్యక్రమాలను కొనియాడిన కృష్ణతులసి
ప్రపంచవ్యాప్తంగా సాల్వేషన్ ఆర్మీ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ వ్యవస్థాపకులు విలియమ్ బూత్ ఎంతో మందికి స్ఫూర్తి నింపారని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ సతీమణి ఆరిమిల్లి కృష్ణ తులసి పేర్కొన్నారు. సాల్వేషన్ ఆర్మీ స్థాపించి 160 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్రోడ్డులోని బాలికల వసతి గృహంలో బుధవారం ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ సతీమణి ఆరిమిల్లి కృష్ణ తులసి పాల్గొని మాట్లాడారు. 1865లో బిలియం బూత్ సాల్వేషన్ ఆర్మీ సంస్థను స్థాపించి సేవా దృక్ఫథంతో ప్రపంచ వ్యాప్తంగా ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలు ఎంతో మందికి స్ఫూర్తి అన్నారు. నిరుపేదలు, అనాధలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ మరోవైపు ఏసుక్రీస్తు బోధనలు అందరికీ పంచుతూ ప్రతిఒక్కరిలో సేవాతత్పరతను నింపేవిధంగా కృషి చేశారన్నారు. సింగపూర్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో సాల్వేషన్ ఆర్మీ, సింగపూర్ తెలుగు అసోసియేషన్ సంయుక్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. సాల్వేషన్ ఆర్మీ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా కొనియాడారు. అనంతరం వసతిగృహంలోని విద్యార్థులకు దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేశారు. అంతకుముందు విలియమ్ బూత్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.