ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడానికి ఎన్నేళ్లు?
కాంట్రాక్టరు, అధికారులకు కనీస బాధ్యత లేదా..?
ప్రజలప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?
మీ వ్యవహార శైలి కారణంగా ప్రభుత్వంపై వ్యతిరేకత
హైవే నిర్వహణ అధికారులపై ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆగ్రహం
ఇంకా ఎంత మంది ప్రాణాలు తీస్తారు…? ఇంత మంది ప్రాణాలు పోతున్నా కనీసం మానవత్వం అంటూ లేదా..? హైవే నిర్వహణ అధికారుల పనితీరు కారణంగా రాష్ట్రప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేయడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుంది…? అంటూ తణుకు ఎమెమల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉండ్రాజవరం జంక్షన్ వద్ద హైవేపై జరుగుతున్న ఫ్లైవర్ నిర్మాణం కారణంగా అధికారుల నిర్లక్ష్య ధోరణితో ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో సర్వీసు రోడ్లుపై బురద పేరుకుపోయి ప్రమాదాల్లో గతంలో పలువురు మృత్యువాత పడ్డారు. తాజాగా మంగళవారం రాత్రి సైతం సజ్జాపురం ప్రాంతానికి చెందిన దుర్గాప్రసాద్ అనే వ్యక్తి టిప్పర్ లారీ కింద పడి మృతి చెందడంతో ఎమ్మెల్యే రాధాకృష్ణ స్పందించారు. బుధవారం ఫ్లైవోవర్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించి సంబంధిత అధికారులతో ఫోనులో మాట్లాడారు. కనీసం క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని చూడకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఎప్పటికి నిర్మాణం పూర్తవుతుందనే కనీస సమాచారం లేకపోవడం దారుణమన్నారు. బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. గతంలో అనేక పర్యాయాలు అధికారులు, కాంట్రాక్టరు దృష్టికి తీసికెళ్లినప్పటికీ నిర్మాణంలో జాప్యం జరుగుతోందన్నారు. ప్రణాళిక ప్రకారం నిర్మాణ పనులు జరగకపోగా సర్వీసు రోడ్లుపై ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. హైవే నిర్వహణ విభాగం విజయవాడ ప్రాంతీయ అధికారితో ఫోనులో మాట్లాడి తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ముందుగా సర్వీసు రోడ్లు నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను కోరినట్లు చెప్పారు. నిర్మాణ ప్రాంతాల్లో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా, ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ సిబ్బందిని నియమించనున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ వెంట తణుకు మున్సిపల్ కమిషనర్ టి.రామ్‌కుమార్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.