విశాఖపట్నం: (కోస్టల్ న్యూస్)
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు నగరంలోని ఆర్కే బీచ్ రోడ్డులో 3కె, 5కె, 10కె రన్ నిర్వహించనున్నట్లు ట్రస్ట్ సిఇఓ కె.రాజేంద్ర కుమార్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలను తెలియ చేసేందుకు దశపల్ల హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తలసేమియా బాధితులకు మద్దతు తెలిపే గొప్ప లక్ష్యంతో ఈ రన్‌ను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తలసేమియా వ్యాధి గ్రస్తులకు వారి జన్మతహ వచ్చే జన్యు పరమైన వ్యాధి వల్ల వారిలో రక్తం తయారు కాదన్నారు. వారికి ప్రతి 21 రోజులకు ఒక సారి తప్పనిసరిగా రక్తం ఎక్కించి వారిని బ్రతికించు కోవాలన్నారు. దీనికి బోన్ మారో మార్పిడి చేస్తే బాగవుతుం దన్నారు. అయితే దీనికి 25 లక్షల వరకు ఖర్చు అవుతుం దన్నారు. యువతీ యువకులు పెళ్ళికి ముందు జన్యు పరీక్షలు చేయించు కోవడం ద్వారా దీన్ని వ్యాప్తిని కొంత వరకు నిరోధించ వచ్చన్నారు. ప్రతి తలసేమియా రోగిని రక్షించు కోవడానికి ఆరోగ్యకరమైన 10 నుంచి 12 మంది నిరంతర రక్త దాతలు అవసరమన్నారు. మన దేశంలో సుమారు 2 లక్షల మంది తలసేమియా బాధితులు ఉన్నారని, వీరికి తోడు ప్రతి ఏటా 15 వేల మంది అదనంగా తలసేమియా రోగులు జన్మిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రజలందరూ ఈ తలసేమియా రన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని, తలసేమియా బాధితులకు తాము అండగా ఉన్నామనే భరోసా కల్పించాలని ఆయన పిలుపు నిచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, విపత్తుల సమయంలో సహాయం, ఉపాధి కల్పన వంటి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన గుర్తు చేశారు. ట్రస్ట్ ఎక్జిక్యూటివ్ అధికారి గోపి అదుసూపల్లి మాట్లాడుతూ తలసేమియా వ్యాధి గురించి చాలా మందికి సరైన అవగాహన లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాధిగ్రస్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఎన్టీఆర్ ట్రస్ట్ ఇప్పటికే 25 పడకల సామర్థ్యంతో ప్రత్యేకంగా ఒక తలసేమియా కేంద్రాన్ని ప్రారంభించిందని ఆయాన వివరించారు. మనం చేసే సేవా కార్యక్రమాల్లో రక్తదానం అత్యంత గొప్పదని ఆయన అభిప్రాయ పడ్డారు. ప్రతి ఒక్కరూ ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని ఆయన తెలిపారు. తలసేమియా బాధితుల కోసం నిర్వహించే ఈ రన్‌లో పాల్గొని వారికి ధైర్యాన్ని ఇద్దామన్నారు. ఒక్క పరుగు వంద జీవితాల్లో వెలుగు నింపగలదని ఆయన ఉద్ఘాటించారు. తలసేమియా రన్‌లో పాల్గొనడం ద్వారా బాధితులకు మానసిక స్థైర్యాన్ని అందించాలని ఆయన కోరారు. తలసేమియ బాధితులను ఆదుకోవాలనే గొప్ప ఆశయంతో నిర్వహిస్తున్న ఈ తలసేమియా రన్లో విశాఖ నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వారికి భరోసా ఇద్దామని పిలుపు నిచ్చారు. తమ కార్యక్రమానికి ప్రముఖ క్రీడాకారిణి కరణం మల్లీశ్వరి గ్రాండ్ అంబేసడర్ గా వ్యవహరిస్తున్నా రన్నారు. ఆ రోజున బీచ్ రోడ్లో సింగర్ సమీర్ భరద్వాజ్ తో గ్రాండ్ మ్యూజికల్ నైట్ ను నిర్వహిస్తున్నామన్నారు.