గత ప్రభుత్వం పట్టణాన్ని మురికి కూపంలా తయారు చేసింది
జవాబుదారీతనంతో పరిపాలన చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు
వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
తణుకులో కొనసాగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు
తణుకు పట్టణాన్ని ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన డ్రైనేజీలు, రోడ్లు నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు వెల్లడించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శనివారం తణుకు పట్టణంలోని 27, 28 వార్డుల్లో ఇంటింటికి పర్యటించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ గత ఏడాదికాలంగా అందుతున్న సంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ పారదర్శకంగా ప్రజలకు జవాబుదారితనంగా పాలన అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. గత ఐదేళ్ల వైసిపి ప్రభుత్వ హయాంలో కనీసం డ్రైనేజీల్లో పేరుకున్న సిల్టు తీయకుండా మురికి కూపంలా తయారు చేశారని ఆరోపించారు. పట్టణంలోనే మొత్తం 32 వార్డుల్లో ప్రధాన డ్రైనేజీల్లో సిల్టు తొలగించే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు. వర్షాకాలంలో తలెత్తే దోమల సమస్యను పరిష్కరించే విధంగా యాంటీ లార్వా స్ప్రే చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. తణుకు పట్టణంలో పారిశుధ్యం నిర్వహణకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతూ ప్రజలు ఎప్పటికప్పుడు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.