ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఆర్ధిక సహాయం
మృతుల ఇళ్లకు వెళ్లి చెక్కులు అందజేసిన హోం మంత్రి అనిత, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్
పేలుడు ఘటనపై దర్యాప్తు జరుగుతోంది, నివేదిక వచ్చాక కారణాలు తెలుస్తాయి : హోం మంత్రి
విశాఖపట్నం: ఆగష్టు 9 (కోస్టల్ న్యూస్)
నగరంలోని ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో బుక్కావీధి వద్ద వెల్డింగ్ షాపులో గురువారం సాయంత్రం సిలిండర్ పేలుడు జరిగి ముగ్గురు మరణించిన ఘటనలో ఆయా మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొంది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల సహాయం అందించనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించగా ఈ మేరకు ముఖ్యమంత్రి ప్రకటించిన సహాయాన్ని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత శనివారం అందజేశారు. నగరంలోని ఫిషింగ్ హార్బరు ప్రాంతంలో నివసిస్తున్న మృతుడు చింతకాయల ముత్యాలు ఇంటికి శనివారం విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, నగర మేయర్ పీలా శ్రీనివాసరావులతో కలసి వెళ్లి పరామర్శించారు. ముత్యాలు భార్య ప్రమీల, వెల్డింగ్ షాపులో పనిచేసే మరో వ్యక్తి శ్రీను భార్య లక్ష్మిలతో మాట్లాడి వారికి ప్రభుత్వం అండగా వుంటుందని, ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. అనంతరం ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల సహాయానికి సంబంధించిన చెక్కులు అందజేశారు. సున్నపు వీధిలో నివసిస్తున్న వెల్డింగ్ షాపు యజమాని మృతుడు గణేష్ ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని హోం మంత్రి పరామర్శించారు. ఆయన భార్య సుధకు ధైర్యం చెప్పి రూ.10 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో ముగ్గురు వ్యక్తుల మరణించారని, గాయాల పాలైన వారిలో ఎర్రా ఎల్లాజీ, రంగారావులో కె.జి.హెచ్.లోను, పి.సన్యాసి మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వారికి అందుతున్న వైద్య చికిత్సలను నిరంతరం పర్యవేక్షించాల్సిందిగా, మెరుగైన వైద్య అందించేలా అధికారులను, ఆసుపత్రి వైద్యులను ఆదేశించామని చెప్పారు. వెల్డింగ్ షాపు సమీపంలోని పలు దుకాణాల్లో వున్న వారు కూడా ఈ ఘటనలో గాయపడినట్లు తెలిసిందని, వారికి కూడా వైద్య సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనలో వెనువెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టిన నగర పోలీసు కమిషనర్, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులను అభినందించారు. సిలిండర్ పేలుడు ఘటనపై పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణుల దర్యాప్తు జరుగుతోందని, పేలుడుకు గల కారణాలపై ఇప్పుడే ఒక నిర్ధారణకు రాలేమని చెప్పారు. సముద్రంలో దొరికిన గుర్తు తెలియని వస్తువులను భద్రపరచడం, వాటి గురించి అధికారులకు సమాచారం ఇవ్వడంపై పోలీసు, రెవిన్యూ శాఖల ద్వారా మత్స్యకారుల్లో అవగాహన కలిగిస్తామని చెప్పారు. ఈ పర్యటనలో కార్పొరేషన్ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.