కానూరు అగ్రహారానికి చెందిన ఇద్దరు బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా చెరో రూ.10వేల వ్యక్తిగత ఆర్థిక సాయం అందజేత.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీ
కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకొని మృతదేహాల పరిశీలన.. ప్రమాద ఘటనపై ఆరా.. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి దుర్గేష్
ప్రయాణాల సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచన
నిడదవోలు: కొవ్వూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ఇద్దరు దినసరి కూలీలు మృతి చెందడంపై మంత్రి కందుల దుర్గేష్ సంతాపం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే పెరవలి మండలం కానూరు అగ్రహారం కి చెందిన దవులూరి సుబ్రహ్మణ్యం (44), లంకే ప్రసాద్(26)లు శనివారం తెల్లవారుఝామున 6.30 గం.లకు కడియపు లంకలో పూల కుండీల లోడ్ పనికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా విజ్జేశ్వరం -సీతంపేట సమీపంలో రంగా విగ్రహం దగ్గర వెనకనుండి వస్తున్న లారీ బలంగా బైక్ ను ఢీకొనడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం స్థానికులు వారిని కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం తెలిసిన వెంటనే మంత్రి కందుల దుర్గేష్ హుటాహుటిన కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. ఘటనపై వివరాలు ఆరా తీశారు. తక్షణ సాయంగా బాధిత కుటుంబాలకు చెరో రూ.10000 ల వ్యక్తిగత ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ప్రభుత్వం తరపున వారికి సాయం అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ప్రయాణాల సమయంలో జాగ్రత్తగా ఉండాలని, ఏ కుటుంబానికి ఈ పరిస్థితి రావొద్దని మంత్రి కందుల దుర్గేష్ ఆవేదన వ్యక్తం చేశారు.