తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరంలోని నన్నయ విశ్వవిద్యాలయం, శ్రీ శ్రీ కళావేదిక సంయుక్తంగా నన్నయ విశ్వవిద్యాలయంలో శనివారం నిర్వహించిన 141 వ జాతీయ శతాధిక కవి సమ్మేళనంలో మండలంలోని పాలంగి గ్రామానికి చెందిన విశ్రాంత ఆంగ్ల భాష అధ్యాపకులు కోట రామ ప్రసాద్ పాల్గొని తమ కవిత వినిపించారు. నన్నయ విశ్వవిద్యాలయం సెమినార్ హాల్ లో జరిగిన ఈ కవి సమ్మేళనంలో టీవీ, సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్, రచయిత, కవి కూడా అయిన కోట రామ ప్రసాద్ తమ స్వీయ రచన “మతం కన్నా మానవత్వం గొప్పది” అనే వచన కవితను శనివారం రాత్రి వినిపించి ఆహూతుల అభినందనలు పొందారు. ఈ కవి సమ్మేళనంలో సుమారు 150 మంది కవులు పాల్గొని తమ కవిత్వం వినిపించి సత్కారములు పొందారు. ఈ సందర్భంగా ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ సహాయ ఆచార్యులు డా.తరపట్ల సత్యనారాయణ, శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ సి.ఈ. ఓ. కత్తిమండ ప్రతాప్, జాతీయ కన్వీనర్ శ్రీమతి కొల్లి రమావతి, జాతీయ ప్రధాన కార్యదర్శి డా.టి.పార్థసారథి మరియు కార్యవర్గ సభ్యులు, కోట రామ ప్రసాద్ ను దుశ్శాలువా, జ్ఞాపిక, ధృవపత్రంతో సత్కరించారు. తనకు జరిగిన ఈ ప్రతిష్ఠాత్మకమైన సన్మానానికి కోట రామ ప్రసాద్ నన్నయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ సహాయ ఆచార్యులు డా. తరపట్ల సత్యనారాయణ, ప్రిన్సిపాల్ ఆచార్య డి.జ్యోతిర్మయి, రిజిస్ట్రార్ ఆచార్య డి.సుధాకర్ వారికీ, శ్రీశ్రీ కళా వేదిక సి.ఈ. ఓ. కత్తిమండ ప్రతాప్ కుమార్, కార్యవర్గ సభ్యులు అందరికీ తమ కృతజ్ఞతాభివందనములు తెలియజేసారు.