రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులుగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఎన్నికయ్యారు. పీఏసీ కమిటీలో 9 మంది సభ్యులు నామినేషన్ వేయగా రాధాకృష్ణ ఎన్నికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఆదాయ వ్యయాలను పరిశీలించే కమిటీలో సభ్యులు కావడానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, రాష్ట్ర ఐటీ శాఖమంత్రి నారా లోకేష్ కు రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు పరిశీలన, ప్రభుత్వం చేసే వ్యయాల పరిశీలనతో పాటు ప్రభుత్వానికి ఆదాయాలను పెంపొందించే మార్గాలను సూచించడం, ప్రభుత్వాదాయాలను సద్వినియోగం అయ్యేలా ఖర్చులు చేయడం తదితర అంశాలలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కీలకపాత్ర వహిస్తుంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన కమిటీ సభ్యులుగా రాధాకృష్ణ నియమితులు కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
