తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ప్రొఫెసర్ చంగయ్య పై ఇటీవల దాడి చేసిన భజరంగ్ దళ్, విహెచ్పి నాయకులను అరెస్టు చేసి వెంటనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉండ్రాజవరం మండల బిఎస్పి నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఉండ్రాజవరం తహసిల్దార్ కార్యాలయంలో బీఎస్పీ నాయకులు వినతి పత్రం అందించారు. మండల బీఎస్పీ నాయకుడు మర్రి మహాలక్ష్ముడు మాట్లాడుతూ ప్రొఫెసర్ చంగయ్య ఎస్.వి. యూనివర్సిటీలో క్రైస్తవ మతప్రచారం చేస్తున్నారనే నెపంతో విశ్వహిందూ పరిషత్, ఆర్.ఎస్.ఎస్. బజరంగ్ దళ్ కార్యకర్తలు వైస్చాన్సులర్ ఛాంబర్ లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఆయనపై దాడి చేసి వైస్ ఛాన్సులర్ కార్యాలయంలో ఫర్నిచర్ ను ధ్వంసం చేశారన్నారు, అంతేకాకుండా ఆయన కారును కూడా రాళ్లతో ధ్వంసం చేసి హత్యాయత్నం చేశారని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ విధంగా దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మర్రి మహాలక్ష్ముడు, బత్తిన ఆశీర్వాదం, చల్లా బత్తుల సత్యానందం, గుమ్మాపు శ్రీను, బద్ద జాన్, నూకపేయి పునీత్, చదలవాడ రాంబాబు, బుజ్జి పాస్టర్స్ షారోన్, జే. దానియేలు, సుధాకర్, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.