ఆరబెట్టిన ధాన్యాన్ని త్వరితగతిన రైతు మీసేవా కేంద్రాన్ని సంప్రదించి నచ్చిన రైసు మిల్లులకు రైతులు తరలించుకోవాలి. ప.గో.జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి పాలకోడేరు గ్రామంలో శుక్రవారం ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. శృంగవృక్షం యస్వివియస్ రైసుమిల్లును జిల్లా జాయింటు కలెక్టరు తనిఖీ చేశారు. ఈ సందర్భంలో ధాన్యం తీసుకు వచ్చిన రైతులతో మాట్లాడారు. ధాన్యం తూకం తూసేమిషన్లు పరిశీలించి ఒక బస్తాను వేసి తూకం చూసారు. కొంత ధాన్యం వేసి తేమశాతాన్ని స్వయంగా పరిశీలించారు. రైసుమిల్లు రిజిస్టర్లు, కంప్యూటర్ డేటాను పరిశీలించి, కొన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింటు కలెక్టరు మాట్లాడుతూ రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని కాలయాపనలు చేయకుండా అన్లోడు చేసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటలలోపుగా వారి ఖాతాలకు సొమ్ము జమచేసే విధంగా చర్యలు తీసుకున్నామని ఎవ్వరు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. రైతులు వారి సమీప రైతు సేవా కేంద్రమును సంప్రదిస్తే ధాన్యం కోనుగోలు కేంద్రంలో పనిచేయు సిబ్బంది స్వయంగా కల్లాలవద్దకు వచ్చి ధాన్యాన్ని పరీక్షించి కోరిన రైసు మిల్లుకు తరలించడం జరుగుతుందని తెలిపారు. అమ్మిన ధాన్యానికి రైతుఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాలో ధాన్యం సొమ్ము జమచేయడం జరుగుతుందన్నారు. దళారులను నమ్మి ధాన్యం అమ్ముకుని మోసపోవద్దని, గిట్టుబాటు ధర పొందుటకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని, ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పంట దిగుబడి తగ్గట్టుగా గోనేసంచులు ముందుగానే తీసుకోవాలని జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి రైతులకు సూచించారు. ఈ సందర్భంలో రెవిన్యూ, సివిల్ సప్లైస్, వ్యవసాయ శాఖల సిబ్బంది, రైతులు, తదితరులు వున్నారు.