రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ పి. దాత్రిరెడ్డి…. కృష్ణాజిల్లా రైతుల నుండి ధాన్యం కొనుగోలు పై జిల్లా రైస్ మిల్లర్లతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అత్యవసర సమావేశం నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం జిల్లా రైస్ మిల్లర్స్ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి.దాత్రిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ వాతావరణంలో ప్రతికూల మార్పుల కారణంగా కృష్ణాజిల్లాలో ఒక్కసారిగా పంటకోతలతో పెద్ద మొత్తంలో దాన్యం పోగుపడిన కారణంగా ముఖ్యమంత్రివర్యులు సూచన మేరకు కృష్ణా జిల్లా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని సూచించారు. జిల్లాలోని రైస్ మిల్లర్స్ సహృదయంతో అర్థం చేసుకుని కృష్ణాజిల్లా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి జిల్లాలోని రైస్ మిల్లుల నుండి రోజుకు 50 వాహనాలను, గోనె సంచులను, హమాలీలను కృష్ణా జిల్లాకు పంపించి సుమారు 1000 మెట్రిక్ టన్నులు కృష్ణాజిల్లా రైతుల నుండి ధాన్యం సేకరించేందుకు రైస్ మిల్లర్లు సహకరించాలని కలెక్టర్ కోరారు. జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో 23,761 మంది రైతుల నుండి ఇంతవరకు1,81,418 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. వీటి నిమిత్తం రూ.369 కోట్లు రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం జరిగిందన్నారు.ప్రభుత్వం తెలిపిన విధంగా 48 గంటల్లోపుగానే ధాన్యం అమ్మిన రైతుల యొక్క బ్యాంకుల ఖాతాల్లో నగదు జమ అవుతుందన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో 08812-230448,7702003584 మరియు టోల్ ఫ్రీ నెంబర్ 18004256453 నెంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి వి.శ్రీలక్ష్మి, డిఎస్ఓ ఆర్ఎస్ఎస్ రాజు ,ఉపరవాణా కమిషనర్ ఎస్ కె కరిమ్ ,జిల్లాలోని పలువురు రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.