గోడ పత్రిక ట్రోఫీ ఆవిష్కరించిన కంచర్ల – ఈనెల16 నుంచి 22 వరకు నిర్వహణ
సమాజ సేవలో నిరంతరం తీవ్ర ఒత్తిడికి లోనయ్యే జర్నలిస్టులు క్రీడా పోటీలు నిర్వహించుకోవడం అభినందనీయమని ఏపి ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్, ఉపాకార్ ట్రస్టు అధినేత కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. ఈనెల 16 నుంచి 22 వరకు జీవీఎంసీకి చెందిన ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో విశాఖ మీడియా క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన గోడపత్రికను, ట్రోఫీలను కంచర్ల ఎంవీపీలోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల పాటు మీడియా మిత్రులు పోటీలు నిర్వహించుకోవడం వల్ల వారిలో క్రీడా స్పూర్తి పెరగడంతో పాటు శారీరక దేహదారుడ్యం మెరుగుపడుతుందన్నారు. ఈ టోర్నమెంటులో విజేతలు ఎవరైనా అందరూ క్రీడాస్పూర్తితో ముందుకు సాగాలన్నారు. టోర్నీకి తన వంతు సహకారం అందిస్తామన్నారు. కళాకారులు, జర్నలిస్టులు సమాజానికి రెండు కళ్లులాంటివారన్నారు. వారు బాగుంటే సమాజం మరింతగా బాగుటుందని ఆయన ఆకాంక్షించారు. సింహాచలం దేవస్థానం మాజీ ధర్మకర్త, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సలహా మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ టోర్నమెంట్ పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని కోరారు. అలాగే పాల్గొంటున్న జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ తరహా టోర్నమెంట్ వల్ల అందరూ ఒకే వేదికపై కలుసుకోవడానికి అవకాశం కలుగుతుందని, ఐక్యతకు దోహదం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టోర్నీ నిర్వాహకులు గురుప్రసాద్, మదన్ ,ఈశ్వరరావులతో పాటు కళాకారులు గెంబలి జగదీష్, నెహ్రూ తదితరులంతా పాల్గొన్నారు.